కట్టంగూర్, మే 05 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో జరుగుతున్న దోపిడిని అరికట్టాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. కట్టంగూర్ మండలంలోని ఈదులూరు, మునుకుంట్ల, కల్మెర, కట్టంగూర్, అయిటిపాముల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన మంగళవారం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను సమస్యలు అడిగి తెలుసుకుని మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా కొనుగోళ్లు మందకోడిగా సాగుతున్నాయన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గాలి దుమారంతో కూడిన వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
కాంటా వేసిన రైతుల ధాన్యం బస్తాలను లారీల కొరత సాకుతో మిల్లులకు తరలించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. క్వింటా ధాన్యానికి తాలు పేరుతో 5 కేజీల తరుగు తీయడంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, మండల కమిటీ సభ్యులు గుడుగుంట్ల రామకృష్ణ, ఇటుకల సురేందర్, జాల అంజనేయులు, ముసుకు రవీందర్, ఊట్కూరి శ్రీనివాస్, కిరణ్, లింగయ్య, సందీప్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.