రంగారెడ్డి, జూలై 23 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం: ‘ఎకరాల్లో భూములు కొని, గజాల్లోకి మార్చి.. బకరాలకు కట్టబెడుతున్నారు’ – సొంత పార్టీ ఎమ్మెల్యేను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రకటన ఇది. ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు అటు ప్రభుత్వంలో, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అయితే.. సీఎం ఆ మాటలను యథాలాపంగా అనలేదని, సదరు ప్రజాప్రతినిధి వందల మంది సామాన్యులను బకరాలను చేశారనే విషయం తెలిసే ఇలా పరోక్షంగా దెప్పిపొడిచి ఉంటారని స్థానికులు చెప్తున్నారు. ఇందుకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఘటనే సాక్ష్యం. రేవంత్రెడ్డి అన్నట్టుగానే సదరు ఎమ్మెల్యే ప్రభుత్వ భూమిని ఎకరాలు గా కొని, గజాలుగా మార్చి.. వందల మందికి కట్టబెట్టి బకరాలుగా మార్చారు. 33 ఎకరాల ఓవర్ల్యాపింగ్ భూమిని తన రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా కొనుగోలు చేసి, వెంచర్లు వేసి ఆ ప్లాట్లను విక్రయించారు. తీరా ఇప్పుడు అది ప్రభుత్వ భూ మిగా తేలడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు.
ఇదీ 33 ఎకరాల కథ
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని ఖానాపూర్ సమీపంలో ఉన్న సాగర్-హైదరాబాద్ రహదారికి ఆనుకొని సర్వేనెంబర్ 67లో 33 ఎకరాలకుపైగా ఓవర్ల్యాపింగ్ భూమి ఉన్నది. 1954లో కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ భూమిని సుమారు 30మంది భూముల్లేని రైతులకు ఒక్కొక్కరికి ఎకరం చొప్పున కేటాయించింది. అసైన్డ్ పట్టాలు, పాస్ పుస్తకాలు అందజేసింది. మరోవైపు గతంలో ఖానాపూర్ గ్రామానికే చెందిన 15మంది పైరవీకారులు 67 సర్వే నంబర్లోని భూములను పక్కనే ఉన్న సర్వేనెంబర్ 80 కింద చూపిస్తూ.. మంచాల తాహసీల్దార్ కార్యాలయం నుంచి పట్టాలు పొందారు. ఇలా ఈ 33 ఎకరాలపై కొందరికి అసైన్డ్ పట్టాలు, మరికొందరికి సొంత పట్టాలు వచ్చాయి. దీంతో వివాదం కొనసాగుతున్నది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ రూ.100 కోట్లకుపైగా ఉంటుందని స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తున్నారు.
రైతుల నుంచి రియల్ ఎస్టేట్ సంస్థ చేతికి..
వివాదాస్పద 33 ఎకరాలను సొంతం చేసుకునేందుకు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఒక బడా ఎస్టేట్ సంస్థ రంగంలోకి దిగింది. స్థానికంగా ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ముందుగా ఈ భూములను తీసుకున్నారు. భూమికి రెండు రకాల యజమానులు ఉండటంతో, ఎటువైపు నుంచీ ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడ్డారు. సర్వే నంబర్ 67లో ఉన్న అసైన్డ్ పట్టాదారుల నుంచి 99 సంవత్సరాలకు లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అక్రమంగా సర్వే నంబర్ 80లో చూపి పట్టాలు పొందినవారి దగ్గరి నుంచి నేరుగా కొనుగోలు చేశారు. ఇలా ఓవర్ల్యాపింగ్ భూమి 33 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లింది. అక్కడినుంచి ఈ భూమి జేబీ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు 27 ఎకరాలు, గురునానక్ విద్యాసంస్థలకు 6 ఎకరాలు చేరింది. రియల్ ఎస్టేట్ సంస్థ ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేదని చెప్తున్నా రు. గురునానక్ విద్యాసంస్థలు ఈ భూమిలో పలు భవనాలు నిర్మించింది. జేబీ రియల్ ఎస్టేట్ సంస్థ కొంత భూమిని నేరుగా అమ్మినట్టు చెప్తున్నారు. మిగతా భూమిని ప్లాట్లుగా విక్రయించింది. ఇది ప్రభుత్వ భూమి అని తెలిసినా అధికారులు రిజిస్ట్రేషన్లు చేసేశారు.
స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి..
ఇటీవల ఖానాపూర్ గ్రామానికి చెందిన కొంతమంది 33 ఎకరాల ఓవర్ల్యాపింగ్ భూమిని అక్రమార్కులు కాజేస్తున్నారంటూ ఫిర్యాదు చేయటంతో జిల్లా రెవెన్యూ యంత్రాంగంలో కదలిక వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సైతం ఇది ప్రభుత్వ భూమి అని, కొంతమంది సర్వేనెంబర్లు మార్చి క్రయవిక్రయాలు జరిపారని, ప్లాట్లుగా మార్చి విక్రయించారని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ ఈ భూమిని సర్వే చేయాలని ఆదేశించారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు వచ్చి సర్వే చేశారు. ఇబ్రహీంపట్నం ఖానాపూర్ గ్రామాల మధ్య సర్వేనెంబర్ 67లో 33ఎకరాల ఓవర్ల్యాపింగ్ భూమి ఉన్నదని నిర్ధారించారు. ఈ భూమిని గతంలో సర్వేనెంబర్ 80కింద మార్చుతూ అక్రమంగా పట్టాలు పొంది విక్రయించారని తేల్చారు. దీంతో 33 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి, ఎలాంటి క్రయవిక్రయాలు జరుపవద్దని ఆదేశించింది.
300 నుంచి 500 మంది..
జేబీ సంస్థ వెంచర్ నుంచి 300 నుంచి 500 మంది వరకు ప్లాట్లను కొన్నట్టు సమాచా రం. ప్రభుత్వం వీటిని నిషేధిత జాబితాలో చే ర్చడంతో కొనుగోలు చేసిన వారు అవస్థలు ప డుతున్నారు. తమను నమ్మించి మోసం చేసి న కంపెనీ ఇప్పుడు పట్టించుకోవడం లేదని మం డిపడుతున్నారు. తామంతా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని లబోదిబోమంటున్నారు.
బోర్డులు మాయమైనా చర్యల్లేవు
రెవెన్యూ అధికారులు సర్వే అనంతరం ఈ భూమికి హద్దురాళ్లను ఏర్పాటుచేసి ‘ఈ భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది’ అంటూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అయితే రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన వారు ఆ బోర్డులను తొలగించినట్టు స్థానికులు చెప్తున్నారు. ఏర్పాటుచేసిన మూడు రోజులకే బోర్డులు మాయమైనా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోలేదని స్థానికులు చెప్తున్నారు.