మిర్యాలగూడ, ఆగస్టు 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.2లక్షలలోపు పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని రైతులెవరూ అధైర్య పడవద్దని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,37,779 మందికి రూ.2,810 కోట్ల రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక రుణమాఫీలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల, కొందరు రైతుల ఆధార్‌కార్డు, రేషన్‌కార్డుల్లో తప్పులు ఉన్నందున కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని, వాటిని సరి చేసి రుణమాఫీ అందచేస్తామన్నారు. కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా గతంలో లక్ష రూపాయల వరకు రుణాలు ఇచ్చారని, దాన్ని లక్షన్నర వరకు పెంచామన్నారు. ఈ సీజన్లో రూ.90 కోట్ల రుణాలు అందించేందుకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా 11 కేంద్ర సహకార బ్యాంకులను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను పంపించామన్నారు. నాయకులు పొదిల శ్రీనివాస్, తమ్మడబోయిన అర్జున్, చలపతిరావు, శ్రీనివాస్, గౌస్ పాల్గొన్నారు.