కట్టంగూర్, ఆగస్టు 23 : పంట రుణమాఫీపై పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. వారం రోజులుగా కట్టంగూర్ వ్యవసాయ కార్యాల యం, రైతువేదికల చుట్టూ రైతులు వరుస కడుతున్నారు. గ్రామాల నుంచి వచ్చిన రైతులు తమకు రుణమాఫీ వర్తింస్తుందా లేదా అని అధికారులతో మొరపెట్టుకుంటున్నారు. రెండు లక్షల రూపాయల కంటే తక్కువ అప్పు తీసుకున్నా తమకు రుణమాఫీ కాలేదని చాలామంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కట్టంగూర్ మండలంలో 10వేల మంది రైతులకుగానూ సుమారు 5వేల మందికే మూడు విడుతల్లో రుణమాఫీ అయ్యింది. మిగతా 5వేల మందికి పలు నిబంధలన కారణంగా నిలిపివేశారు. దాంతో రుణమాఫీ కాని రైతుల కోసం వ్యవసాయ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడంతో దరఖాస్తులు ఇచ్చేందుకు రైతులు బారులుదీరుతున్నారు. రేషన్ కార్డు లేకపోవడం, పేరు తప్పులు ఉండడటంతోపాటు ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్ బ్యాంకుల్లో అనుసంధానం చేయకపోవడం వంటి కారణాలతో రుణమాఫీ కాలేదు.
దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సహకార బ్యాంకుల్లో అనేక చోట్ల గడువు తేదీల కంటే ముందే రుణాలు తీసుకున్నా..సిబ్బంది ఆలస్యంగా ఆన్లైన్లో నమోదు చేయడంతో మాఫీ కాలేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వం రుణమాఫీకి షరతుల పేరుతో రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నది. ఎటువంటి షరతులు లేకుండా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు నబంధనలు పెట్టడం బాధాకరం. నేను కట్టంగూర్ ఏపీజీవీబీలో 1.60లక్షల రుణం తీసుకొని ప్రతి సంవత్సం రెన్యూవల్ చేసుకుంటున్నా. రుణమాఫీ లిస్టులో నాపేరు లేకపోవడంతో అధికారులను అడిగితే రేషన్‌కార్డు లేకపోవడంతో మాఫీ కాలేదని చెబుతున్నారు. రెండు లక్షలు రుణం తీసుకున్న రైతులకు నిబంధనలు లేకుండా రుణమాఫీ చేయాలి.
-పాదూరి శిశుపాల్‌రెడ్డి రైతు, కల్మెర, కట్టంగూర్ మండలం
రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కన్నీరే మిగిల్చింది. నాకు నా భార్య పేరు మీద రెండు లక్షల వరకు పంట రుణం ఉంది. మాఫీ వస్తుందిలే అని సంతోషపడ్డాం. ప్రభుత్వం ఇచ్చిన మూడు లిస్టుల్లో మా పేరు లేకపోవడంతో ఎంతో బాధ పడ్డాం. ఈ ప్రభుత్వం కొందరకే మాఫీ చేసి చేతులు దులుపుకుంది. సీఎం, మంత్రులు రుణమాఫీపై పూటకోమాట మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం.
-తరి రమేశ్, పూసలపాడు, రైతు, మాడుగులపల్లి మండలం
కాంగ్రెస్‌కు రైతుల ఉసురు తగులుతుంది
రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను ఘోస పెడుతున్నది. రుణమాఫీని రైతులకు ఎలా ఎగ్గొట్టాలని నానారకాల రూల్స్ పెడుతున్నది. నాపేరు మీద లక్షా యాభై వేలు, మా అమ్మ పేరుమీద 90వేల రూపాయలు పంట రుణం తీసుకున్నాం. రుణమాఫీ అవుతుందని ఎంతో ఆశతో ఎదురుచూశాం. ఇద్దరం ఒకే రేషన్‌కార్డులో ఉన్నామని లింక్‌తో మాఫీ కాలేదు. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మే పరిస్థితి లేదు. రైతును ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం నిలబడలేదు. రేపు వీరి పరిస్థితి కూడా అంతే. కాంగ్రెస్‌కు రైతుల ఉసురు తగులుతుంది.
-అడప వెంకటేశ్వర్లు, రైతు, ఇర్కిగూడెం, మిర్యాలగూడ టౌన్
కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మాటతప్పింది. లేనిపోని కారణాలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఈ విషయంలో మంత్రులు తలో రకంగా మాట్లాడుతూ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారు. మా ఇంటిలో నా పేరు మీద మాత్రమే రుణం తీసుకున్నా. అయినా నాకు రుణమాఫీ కాలేదు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా నడుస్తున్నాయి. ఈ సమయంలో మాఫీ కాని రైతులు బ్యాంకులు, ఏఓల చుట్టూ తిరుగడం ఇబ్బందిగా ఉంది. వెంటనే రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న వారందరికీ రుణమాఫీ వర్తింపజేయాలి.
-పాలేటి రామారావు, మాజీ రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు, రామాపురం, మేళ్లచెర్వు
మా ఊర్లో రెండున్నర ఎకరాల భూమి ఉన్నది. ఇండియన్ బ్యాంకులో లక్షా50వేలు లోను తీసుకున్నా. సర్కారోళ్లు రూ. రెండు లక్షల రుణం మాఫీ అవుతుందంటే ఎంతో సంబురపడ్డా. పాసు బుక్కు పట్టుకొని బ్యాంకుకు పోతే లిస్టులో నీ పేరు లేదన్నరు. మాకేం తెలియదు అని బ్యాంకు సారు చెప్పిండు. సరిగా చూడండి అని చెబితే లేదమ్మా నీ పేరు లేదు విసికించకు అన్నడు. ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియడం లేదు. కొంత మందికి రుణమాఫీ చేయడం బాగా లేదు. నాకు మస్తు బాధ కలుగుతుంది.
-మైల ఆండాలు, బ్రాహ్మణ వెల్లెంల, నార్కట్‌పల్లి మండలం