రామగిరి, నవంబర్ 3: నేటి తరం విద్యార్థులను యువ రచయితలుగా తయారు చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా వారిని సాహిత్య అంశాలపై చైతన్యం చేసి నూతన రచనలు వెలుగులోకి తేవాలని ప్రముఖ సాహితీవేత్త సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తెలంగాణ సాహితీ ఉమ్మడి నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండలోని టీఎస్‌యూటీఎఫ్ భవనంలో తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సాహిత్య సదస్సులో ఆయన మాట్లాడారు. సాహిత్య రంగంలో అభ్యుదయ సాహిత్యం నుంచి ఇప్పటి వరకు వచ్చిన సాహితీ సంస్థలు, వాటి దృష్టి కోణాలు, పరిమితుల గురించి వివరించారు. ఇన్నాళ్లు అణగారిన వారి జీవితాలపై ఆధిపత్యం చేసిన మత దురహంకారం మళ్లీ పడగా విప్పి విజృంభిస్తున్నదన్నారు.
ఇది సాధారణ ప్రజల జీవితాలకు ప్రమాదమని, వాటిని ప్రశ్నించే వైఖరితో రచయితలు, కవులు స్పందించాలని తెలియచేశారు. ముఖ్యంగా విద్యార్థులైన యువ రచయితలు ఈ పనికి పూనుకోవాలన్నారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.అనందాచారి మాట్లాడుతూ సమజం సమూహం నుంచి చీలి ఒంటరి తనంలోకి వెళ్లిపోవడం చాలా ప్రమాదకరమని తెలిపారు. కవులు, రచయితలు స్తబ్ధత నుంచి బయటపడి సరికొత్త సృజనకు ఉపక్రమించాలని, అందుకోసం సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. ఇదే సభలో స్వీయ కవితల్లో వస్తువుపై జీవకవి అనే అంశంపై మునాస్ వెంకట్, స్వీయ కథల్లో సామాజిక జీవన చిత్రాలపై ప్రముఖ కథా రచయిత భూతం ముత్యాలు, స్వీయ గీతాల్లో సామాజిక స్పృహపై ప్రముఖ గాయకుడు అంబటి వెంకన్న, కవి సమ్మేళనంలో పలువురు కవులు ప్రసంగించారు.
సాయంత్రం జరిగిన ముగింపులో తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా డిగ్రీ కళాశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన 147మంది విద్యార్థులు కవితలు రాయగా వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ, ఐదు కన్సోలేషన్ బహుమతులు, ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సదస్సులో జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనంతజు మోహనకృష్ణ, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ప్రముఖ కవులు, సాహితీవేత్తలు సాగర్ల సత్తయ్య, తండు కృష్ణకౌండిన్య, బండారు శంకర్, పెరుమాళ్ల ఆనంద్, చింతోజు మల్లికార్జునచారి, బాసరాజు యాదగిరి, నాగిరెడ్డి, అరుణ జ్యోతి, తరుణోజు భీష్మాచారి, గేర నరసింహ, బూర్గు గోపీకృష్ణ, హసేన, లయన్స్ వనం కిషన్ తదితరులు పాల్గొన్నారు.