Telangana Decade Celebrations | రామగిరి, జూన్ 10 : సమైక్య పాలనలో మరుగున పడ్డ తెలంగాణ సాహిత్యానికి స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పూర్వ వైభవం తీసుకొచ్చారు. ఆదిశగా కవులు, రచయితలను ప్రోత్సహించారు. ఉత్తమ కవులకు అవార్డులు అందించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు రచయితలకు కూడా అవార్డులు దక్కాయి. దాంతో పాటు తెలంగాణ సాహిత్య అకాడమిని ఏర్పాటు చేసి చైర్మన్‌గా కోదాడ వాసి జూలూరి గౌరీశంకర్‌కు అవకాశం కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో నీలగిరి రచయితలు, కవులు అనేక పేరుపొందిన రచనలు చేసి తెలంగాణ అస్తిత్వాన్ని చాటుతున్నారు.
కవులకు పుట్టినిల్లు నల్లగొండ
ఉమ్మడి నల్లగొండ జిల్లా కవులు, కళాకారులకు పుట్టినిల్లు. మన జిల్లాకు చెందిన ఎంతో మంది సాహితీ వేత్తలు తమ రచనల ద్వారా ప్రాచూర్యం పొందారు. నల్లగొండ జిల్లాలోని వెల్లంకి గ్రామానికి చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన వేణుసంకోజుకు రాష్ట్ర ప్రభుత్వం దాశరథీ కృష్ణమాచార్య అవార్డులు అందించింది. దాంతో పాటు దేవరకొండకు చెందిన బండారు సుజాతాశేఖర్కు జానపద సాహిత్యంలో ‘ఉత్తమ మహిళా విశిష్టపురస్కరం’ అందించింది. నల్లగొండకు చెందిన కవి, రచయిత మునాసు వెంకట్ రచనలపై తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఒక రోజు సాహిత్య సదస్సును అధికారికంగా నిర్వహించారు.
యువతను ప్రోత్సహించేలా..
నేటి తరం యువతలో సాహిత్య పఠిమను పెంచి వారిలో రచనాశైలిని పెంచేలా తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘మన ఊరు చరిత్రను మనమే రాసుకుందాం’ కార్యక్రమానికి అకాడమి చైర్మన్ జూలూరి గౌరీశంకర్ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వాప్తంగా అన్ని కళాశాలల్లో ఎంతో మంది విద్యార్థులకు ప్రేరణ కల్పించింది.
నేడు సాహిత్య దినోత్సవం
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాహిత్య దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. అందులో భాగంగా అధికారికంగా కవి సమ్మేళనం ఏర్పాటు చేయనున్నారు. డీఈవో భిక్షపతి, డీపీఆర్ఓ శ్రీనివాస్ పర్యవేక్షణలో నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయదిత్య భవనంలో ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4గంటలకు కవి సమ్మేళనం నిర్వహిస్తారు. కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితోపాటు కలెక్టర్, ప్రజాప్రతినిదులు హాజరు కానున్నారు. మొదట ‘తెలంగాణ అస్థిత్వం- తెలంగాణ అభివృద్దిపై కవితలు వినిపిస్తారు. అనంతరం ఉత్తమ కవులను సన్మానించనున్నారు. ఉత్తమ కవితలతో సంకలన గ్రంథాన్ని ప్రచురించనున్నారు.
తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవం విజయ వంతమైంది
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కవులు, రచయితలు వివక్షతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అడుగుపెట్టే పరిస్థితి ఉండేదికాదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ కల్పించిదన ఆదరణతో కవులు, రచయితలు, సాహితీవేత్తలకు గౌవరం దక్కింది. తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవం విజయవంతమైంది. ఇప్పుడు గౌరవంగా రవీంద్రభారతీలోకి వెళ్తున్నాం. ఎన్నో అంశాలలో మాట్లాడాం. సన్మానాలు పొందాం. చాల సంతోషంగా ఉంది. తెలంగాణ సాహిత్య అకాడమితో మనకు ఎంతో లబ్ధి కలిగింది.
– మునాసు వెంకట్, కవి, రచయిత, నల్లగొండ