నల్లగొండ, జనవరి 1 : న్యూ ఇయర్ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో మద్యం ఏరులైపారింది. రికార్డు స్థాయిలో మద్యం సేల్స్ జరుగగా.. రాష్ట్ర ప్రభుత్వానికి మస్తు ఆదాయం సమకూరింది. డిసెంబర్ 30, 31 తేదీల్లో అమ్మకాలు జోరుగా కొనసాగాయి. ఈ రెండ్రోజుల్లోనే రూ.44.13 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. అంతకుముందు రోజు డిసెంబర్ 29న కూడా రూ.16కోట్ల మద్యం సేల్స్ జరిగాయని ఆబ్కారీ శాఖ లెక్కలు చెప్తున్నాయి. అంటే ఈ మూడు రోజుల్లోనే రూ.60 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
డిసెంబర్ 31.. అందునా వీకెండ్.. ఇంకేముంది మస్తు దావత్లు. ఖుషీ ఖుషీగా ఎంజాయ్మెంట్లు.. పైగా సోమవారం గవర్నమెంటు సెలవు ఇవ్వడంతో మద్యం ప్రియులకు మస్తు మత్తు ఎక్కింది. శనివారం, ఆదివారం మందుతో ఎంజాయ్ చేసి ఉర్రూతలూగిన తర్వాత కనిపించింది ఈ మందు బాబులకు జేబులో ఉన్న పైసలు చిత్తు కాగితాల్లా ఎగిరిపోయాయని.
డిసెంబర్ 31 ఆదివారం, అంతకుముందు శనివారం కావడంతో ప్రైవేటు ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తోపాటు ఇతరులు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎంతో జోష్తో జరుపుకొన్నారు. పైగా జనవరి 1న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతో ఈ రెండు రోజులు మద్యం ప్రియులు ఎంతో ఎంజాయ్ చేశారు. శుక్రవారం రాత్రి మొదలు సోమవారం వరకు తన స్నేహితులు, బంధువులతో కలిసి సరదాగా గడిపారు. అయితే.. ఈ ఏడాది ఒకటి, రెండు చిన్న చిన్న సంఘటనలు మినహా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా జరిగాయి.
ఇయర్ ఎండింగ్ అయిన డిసెంబర్ 30, 31 తేదీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. దాంతో రాష్ట్ర ఆబ్కారీ శాఖకు భారీ ఆదాయం సమకూరింది. ఇయర్ ఎండింగ్లో రెండ్రోజుల మద్యం అమ్మకాల లెక్కలు కండ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి. డిసెంబర్ 30న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 28,895 మద్యం కాటన్లు, 31,503 కాటన్ల బీర్లు బాట్లింగ్ కంపెనీ నుంచి సరఫరా అయ్యాయి. వాటి విలువ రూ.29.56 కోట్లు.
డిసెంబర్ 31న 14,550 కాటన్ల మద్యం, 21,962 కాటన్ల బీర్లు సరఫరా కాగా.. వాటి విలువ 14.57 కోట్ల రూపాయలు. మొత్తంగా ఈ రెండు రోజుల్లో 43,445 మద్యం కాటన్లు, 53,465 కాటన్ల బీర్లు అమ్ముడయ్యాయి. అంటే రూ.44.13 కోట్ల విలువైన మద్యం సరఫరా చేయబడింది. అంతకుముందు రోజు డిసెంబర్ 29న కూడా రూ.16కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఆబ్కారీ శాఖ లెక్కలు చెప్తున్నాయి. మొత్తంగా ఈ మూడు రోజుల్లో ఉమ్మడి జిల్లాలో రూ.60 కోట్ల మందును మద్యం ప్రియులు తాగేశారు.