కట్టంగూర్, నవంబర్ 19 : ఆడపిల్లల పెళ్లి చేయలేక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం వారి ఇళ్లల్లో వెలుగులు నింపుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం కట్టంగూర్ మండలంలో ఈదులూరు నుండి కురుమర్తి గ్రామం వరకు నిర్మించనున్న మెటల్ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం పలు గ్రామాలకు చెందిన 57 మంది కల్యాణ లక్ష్మి, 25 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను తాసీల్దార్ కార్యాలయంలో పంపిణీ చేసి మాట్లాడారు. అన్ని రంగాల్లో ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన పేదల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు పని చేస్తోందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్ ద్వారా అందించే ఆర్ధిక సహాయం పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు ఎంతో ఆసరగా ఉంటుందన్నారు. కల్యాణలక్ష్మి పథకం కోసం లబ్దిదారులు దళారులను ఆశ్రయించవద్దని, లబ్ధిదారులు నేరుగా మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
కల్యాణలక్ష్మి మంజూరులో అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కల్యాణలక్ష్మి, సాదీ ముబారక్ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లింక్ రోడ్లతో గ్రామాలు పూర్తి అభివృద్ధి చెందుతాయని, రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు, డిప్యూటీ తాసీల్దార్ ఆల్బట్ ప్రాంక్లిన్, ఆర్ఐ రామారావు, మాజీ జడ్పీటీసీ మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, మాజీ ఎంపీపీ కొండ లింగస్వామి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, ముక్కాముల శేఖర్, గడుసు శంకర్ రెడ్డి, మిట్టపల్లి శివశంకర్, అయితగోని నర్సింహ్మ, పుల్లిగిల్ల అంజయ్య, నంద్యాల వెంకట్ రెడ్డి, కుంభం అనిల్ రెడ్డి పాల్గొన్నారు.