అల్ప పీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం చిరుజల్లులు పడ్డాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ముసురు వానతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొద్దిరోజులుగా వర్షాలు లేక ఎదురుచూస్తున్న రైతాంగానికి ఊరట కలిగింది. మెట్ట పంటలకు ప్రాణం పోసినట్లయ్యింది.
– నల్లగొండ, జూలై 18
నల్లగొండ, జూలై 18 : అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం పొద్దంతా ముసురు పడింది. ఈ సీజన్ ఆరంభం నుంచి పెద్దగా వర్షాలు పడకపోవడంతో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అడపా దడపా కురిసిన వానలకు ఆయా ప్రాంతాల్లో మెట్ట పంటలతోపాటు నాన్ ఆయకట్టులో నాట్లు సైతం వేశారు.
మంగళవారం కురిసిన ముసురుకు ఆయా పంటలు జీవం పోసుకోనున్నాయి. అయితే ఉదయం వర్ష ప్రభావం పెద్దగా లేకపోయినప్పుటికీ మ ధ్యాహ్నం తర్వాత ముసురుకుని రాత్రి వరకు కురిసింది. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా మునుగోడులో 10మిల్లీమీటర్లు వర్షం కురవగా చండూరులో 8.8, చిట్యాల 7.5, నల్లగొండ 7, నార్కట్‌పల్లి 6.3, గుర్రంపోడు 6, కట్టంగూర్ 5.8, త్రిపురారం 5.8, నిడమనూరు, కట్టంగూర్ 5.3, మాడ్గులపల్లి, నకిరేకల్ మండలాల్లో 5 మిల్లీమీటర్ల వర్షం పడగా మిగిలిన అన్ని మండలాల్లో 5మిల్లీమీటర్ల లోపు వర్షం కురిసింది.
పలు మండలాల్లో మోస్తరు వర్షం
భువనగిరి అర్బన్ : భువనగిరి పట్టణంలో మంగళవారం ఉదయం నుంచి చిరుజల్లులు కురువగా సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షం కురిసింది. ప్రయాణికులు, ప్రజలు ఇబ్బంది పడ్డారు.
ఆత్మకూరు(ఎం) : మండల వ్యాప్తంగా మంగళవారం ముసురుకుంది. ఈ వానతో ఆరుతడి పంటలు సాగు చేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొలకెత్తిన చేలకు ముసురు జీవం పోసిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మోటకొండూర్ : మండల వ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచే ముసురు పడడంతో పలుచోట్ల విద్యుత్‌కు స్వల్ప అంతరాయం కలిగింది.