యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) ; కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల జీవనం ఆగమ్యగోచరంగా మారింది. చాలామంది డ్రైవర్ల కుటుంబాలకు పూట గడవడమే కష్టమైంది. మహాలక్ష్మి పథకం అనంతరం ఆటోలకు గిరాకీ లేక.. ప్రభుత్వం పట్టించుకోక అరిగోస తీస్తున్నారు. డ్రైవర్ల ఆందోళనలకు దిగొచ్చిన సర్కారు ఏటా రూ.12వేల జీవన భృతి ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ ఆచరణకు నోచలేదు. స్వయంగా మంత్రులు ప్రకటించి తొమ్మిది నెలలు అయినా ఇప్పటికీ అమలు చేయలేదు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నది. ఆధార్ కార్డు చూపిస్తే పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ల్లో ఉచితంగా జర్నీ చేసే వెసులుబాటు కల్పించింది. ఈ పథకం ఆటోల గిరాకీపై ప్రభావం చూపుతున్నది. సర్కారు నిర్ణయంతో తాము తాము వీధిన పడ్డామంటూ ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా, డ్రైవర్లను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీకి వారికి మద్దతు నిలిచింది. వరుస ఆందోళనలకు ప్రభుత్వం దిగి వచ్చింది. ఆటో కార్మికుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కల్లిబొల్లి మాటలు చెప్పింది. ప్రతి డ్రైవర్‌కు ఏడాదికి రూ. 12వేల జీవన భృతి కల్పిస్తామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో ఇదే విషయం స్పష్టం చేశారు. సర్కారు చేసే సాయం రోజుకు రూ.33 అని, ఇది తమ జీవనానికి ఎలా సరిపోతుందని ఆటో డ్రైవర్లు అప్పట్లోనే మండిపడ్డారు. ప్రభుత్వం మాత్రం అది కూడా అమలు చేయడం లేదు. ఇప్పటి వరకూ ఒక్క డ్రైవర్ అకౌంట్లో కూడా రూపాయి పడింది లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి, ఆర్టీసీ కార్మికులకు దసరా సందర్భంగా బోనస్ ప్రకటించిన ప్రభుత్వం ఆటో కార్మికులను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆటో డ్రైవర్ యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పూట గడవని దుస్థితి
యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 5 వేల ఆటోలు నడుస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు నిత్యం వందలాది ఆటోలు వస్తూ పోతూ ఉంటాయి. తద్వారా అనేక కుటుంబాలకు ఉపాధి లభిస్తున్నది. గతంలో నిత్యం ఖర్చులన్నీ పోగా నాలుగైదు వందల చేతికి వచ్చేవి. కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండేది కాదు. ఫ్రీ బస్సు వచ్చాక ఆటోలకు ఆదరణ తగ్గింది. గతంలో వచ్చిన డబ్బులో సగం గిరాకీ కూడా ఉండడం లేదు. రోజుకు రూ.200 కూడా మిగలడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. బండి కిస్తీలు కూడా చెల్లించలేకపోతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అప్పులు తెచ్చి చెల్లిస్తుండగా, మరికొందరు కిస్తీలు కట్టలేక చేతులెత్తేస్తున్నారు. దాంతో ఫైనాన్స్ వాళ్లు బండ్లను గుంజుకుపోతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. ఇటీవల అప్పుల బాధ తాళలేక భూదాన్‌పోచంపల్లి మండలంలో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీవన భృతి అందించాలని ఆటో కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
జీవనభృతి అందించాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. సంవత్సరానికి రూ.12 వేలు జీవన భృతిని ఇస్తామని చెప్పి 9 నెలలుగా కాలం గడుపుతున్నది. ఈఎంఐలు కట్టలేక, కుటుంబ ఖర్చులకు వెళ్లక ఆర్థిక ఇబ్బందులతో చనిపోయిన ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం జీవన భృతిని అందించాలి. లేకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతాం.
– గనబోయిన వెంకటేశ్, ఆటో యూనియన్ నాయకుడు
హామీని నిలబెట్టుకోవాలి
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన నేపథ్యంలో ఆటోలకు గిరాకీ ఉండడం లేదు. పొద్దంతా ఆటో తోలినా ఇంటి ఖర్చులకు వెళ్లడం లేదు. రూ.12వేల జీవన భృతి ఇస్తాన్న ప్రభుత్వం ఇప్పటి వరకూ అమలు చేయలేదు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ప్రభుత్వం స్పందించి జీవన భృతి ఇస్తే ఎంతోకొంత ఆసరా అవుతుంది.
-కొయ్యడ కృష్ణగౌడ్, ఆటో డ్రైవర్, తంగడపల్లి(చౌటుప్పల్)
కిస్తీలు కట్టలేక ఫైన్సాన్స్ వాళ్లకు ఆటోలు వదిలిపెడుతున్నం
కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమాని ఆటోడ్రైవర్లు రోడ్డున పడ్డారు. పైనాన్స్ మీద ఆటోలు తీసుకున్నవాళ్లు కిస్తీలు కట్టలేక ఆటోలను వాళ్లకే వదిలేస్తున్నారు. గతంలో దసరా పండుగ వచ్చిందంటే రోజుకు ఐదారు ట్రిప్పులు చౌటుప్పల్-హైదరాబాద్ నడిపేవాళ్లం. ఇప్పుడు రెండు ట్రిప్పులు కూడా పడడం లేదు. బతలేక అప్పుల పాలు అవుతున్నాం. ప్రభుత్వం జీవన భృతి అందించాలి. ప్రతి నెలా పింఛన్ ఇచ్చి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. -వీరమళ్ల లింగస్వామి, ఆటో డ్రైవర్ (చౌటుప్పల్ రూరల్)