రామగిరి, జూన్ 29 : ప్రభుత్వ విద్యా రంగాన్ని పటిష్ట పరచడంలో టీఎస్ యూటీఎఫ్ సంఘ సభ్యులు ముందుండాలని, సంఘ ఉపాధ్యాయులు పనిచేసే ఆయా ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలల్లో స్టడీ అవర్ నిర్వహణకు అదనపు సమయం కేటాయించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం అధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి అధ్యక్షతన సంఘం జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, నోట్ పుస్తకాలు సకాలంలో అందించినందుకు, ఈసారి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కూడా నోటు పుస్తకాలు అందించినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు.
మారుమూల ప్రాంతాల్లో విద్యార్థుల అవసరం మేరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని, అలా కాకుండా జిల్లా కేంద్రానికి, హైవేలకు దగ్గరలో గల ప్రాంతాలకు ఉపాధ్యాయుల వ్యక్తిగత అవసరాల కోసం డిప్యుటేషన్లు చేయడం మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీరు మారకపోతే ప్రత్యక్ష చర్యలకు దిగుతామని హెచ్చరించారు. పీఆర్సీ గడువు తీరినందున రిపోర్టు వెంటనే తెప్పించుకుని అమలు పరచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కార్యదర్శి జి.నాగమణి మాట్లాడుతూ.. జూలై చివరి నాటికి సంఘ సభ్యత్వం పూర్తి చేయాలని జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షులు నర్రా శేఖర్‌రెడ్డి, బి.అరుణ, కోశాధికారి వడిత్య రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు, జిల్లా కార్యదర్శులు రామలింగయ్య, గేర నరసింహ, యాట మధుసూదన్ రెడ్డి, రమాదేవి, నలపరాజు వెంకన్న, చిన వెంకన్న, పగిళ్ల సైదులు, కొమర్రాజు సైదులు, ఆడిట్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, నర్సింహ్మ మూర్తి, భాను ప్రకాశ్, గిరి యాదగిరి, యరనాగుల సైదులు, శ్రీలత, వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.