కట్టంగూర్, అక్టోబర్ 14 : నిమ్మకాయల ధరలు పాతాళంలోకి పడిపోవడంతో నిమ్మ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిమ్మ సాగులో రాష్ట్రంలోనే పేరున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు పడిపోయిన ధరతో ఆందోళన చెందుతున్నారు. వేల రూపాయలు పురుగు మందులకు ఖర్చుచేసిన అన్నదాతల పరిస్థితి దయనీయం. ధరలు పడిపోవడంతో నష్టాలు తప్పేలా లేవంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నిమ్మ ధరలు నిలకడ లేకుండా రోజుకో ధర పలుకుతోంది. ఇటీవల ధర పూర్తిగా పడిపోవడంతో రైతులకు సమస్యలు వచ్చిపడ్డాయి. ప్రస్తుతం ఒక బస్తా పండు కాయలు రూ.70 నుంచి 100, పచ్చి కాయలు రూ.100 నుంచి 200 లకు మించి పలకడం లేదు. కోత కూలీలు, ఆటో కిరాయిలు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మొదటి నుంచి నిమ్మకు ధర లేకపోవడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి నిమ్మకాయలు అధికంగా ఢిల్లీ, బెంగుళూరు, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రభుత్వం నిమ్మ రైతుల గురించి పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నకిరేకల్ నియోజకవర్గం నిమ్మ సాగులో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంది. నకిరేకల్ నియోజకవర్గంలో చిట్యాల, కట్టంగూర్, నార్కట్‌పల్లి, నకిరేకల్, కేతేపల్లి మండలాలతో పాటు తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం మండలంలో సుమారు 2 వేల మంది రైతులు 5,271 ఎకరాలకు పైగా నిమ్మ సాగు చేస్తున్నారు. నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన నిమ్మ మార్కెట్‌కు నియోజక వర్గంలోని పలు గ్రామాల రైతులు ప్రతి రోజూ అటోలు, మినీ లారీల్లో నిమ్మకాయలు తీసుకెళ్తున్నారు.
బస్తా (25 కిలోలు) నిమ్మకాయలు మార్కెట్‌కు తరలించడానికి రూ.వంద ఖర్చవుతుండగా ధర మాత్రం రూ.200 మించి రావడం లేదు. గతేడాది ఇదే సమయంలో బస్తా ధర రూ.1,200 నుండి రూ.2 వేల వరకు ఒకనొక సమయంలో రూ.2,700 వరకు పలికింది. గత రెండు నెలల నుంచి క్రమంగా నిమ్మ ధరలు పడిపోతున్నాయని రైతులు తెలిపారు. రైతులు ఎకరాకు సాగు కోసం రూ.1.20 లక్షలు ఖర్చు చేశారు. పంట దిగుబడి బాగుందని, ఈ ఏడాది మంచి ఆదాయం వస్తుందని భావించిన రైతులకు ధరలు డమాల్ అనడంతో నిరాశే మిగిలింది. గతేదాడి రూ.80 ఉన్న ధర ప్రస్తుతం రూ.10కి పడిపోయింది.
నిమ్మ తోటల వల్ల సంపాదించిందేమీ లేదు. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది ఇదే సమయంలో కిలో వంద రూపాయలు పలికిన ధర ఇప్పుడు రూ.10 రూపాయల కన్నా తక్కువ పలుకుతుంది. ఖాళీ బస్తాకు రూ.10, ఆటో కిరాయి బస్తాకు రూ.20 నుంచి 30, కమీషన్ రూ.15 పోను మాకు చేతి ఖర్చులు కూడా రావడం లేదు. ఇంత భారీ ఎత్తున ధరలు పడిపోవడం ఇదే మొదటి సారి చూస్తున్నాం. ప్రభుత్వం స్పందించి నిమ్మకు గిట్టుబాటు ధర కల్పించాలి.
Kattangur : ధరల పతనంతో ఆందోళనలో నిమ్మ రైతులు.. పట్టించుకోని ప్రభుత్వం