నందికొండ, ఆగస్టు 8 : నాగార్జునసాగర్‌కు పైనుంచి వరద పోటెత్తడంతో పూర్తిస్థాయిలో డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని దిగువన ఉన్న కృష్ణా డెల్టాకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకుగానూ గురువారం 585.90 (300.0315 టీఎంసీలు) అడుగులకు చేరింది. డ్యామ్ క్రస్ట్ గేట్లను 18 నుంచి క్రమంగా పెంచుకుంటూ 26 క్రస్ట్ గేట్ల ద్వారా 2,25,462 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు 3,52,158 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా, 2,72,019 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది. ఎడమ కాల్వ ద్వారా 8,193, కుడి కాల్వ ద్వారా 8,144, క్రస్ట్ గేట్ల ద్వారా 2,25,462, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28,420, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం 885 (215.81 టీఎంసీలు) అడుగులకు ప్రస్తుతం 882.60(202.51 టీఎంసీల) అడుగులు ఉన్నది. ఆల్మట్టికి 2,61,000, నారాయణపూర్‌కు 2,00000, జూరాలకు 3,00000, శ్రీశైలానికి 3,54,761 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. నాగార్జునసాగర్‌కు కూడ భారీగా ఇన్‌ఫ్లో ఉండడంతో మరికొన్ని రోజులు డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగనున్నది.
సాగర్ డ్యామ్ 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల చేయడంతో కృష్ణమ్మ అందాలను తిలకించడానికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే డ్యామ్ వద్దకు చేరుకొని ఫొటోలు, సెల్ఫీలు దిగారు. డ్యామ్ కొత్త బ్రిడ్జి, శివాలయం పుష్కరఘాట్, జలవిద్యుత్ కేంద్రం, డ్యామ్ పిల్లర్, లాంచీస్టేషన్, దయ్యాల గండి పరిసరాలు పర్యాటకులతో సందడిగా మారాయి. చేపల ఫ్రై, ఐస్‌క్రీమ్‌లు, మసాల చాట్లను ఆస్వాదీస్తు పర్యాటకులు సరదాగా గడిపారు. పర్యాటకుల రద్దీ నేపథ్యంలో పోలీసులు పటిష్టంగా భద్రతతోపాటు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. డ్యామ్ 420 లెవల్, కొత్త బ్రిడ్జి నుంచి శివాలయం పుష్కరఘాట్ వరకు వాహనాలను అనుమతించి అక్కడి నుంచి పర్యాటకులను కాలినడకన డ్యామ్ పరిసరాల్లోకి పంపిస్తున్నారు. పైలాన్‌కాలనీలోని జెన్కో జంక్షన్ వద్ద పోలీసులు వాహనాలను నిలుపుదల చేసి పైలాన్ నుంచి నేరుగా మాచర్ల వెళ్లే వాహనాలను పంపిస్తున్నారు. నడువ లేని వారు, వృద్ధులు ఉన్న వాహనాలను డ్యామ్ పరిసరాలకు అనుమతిస్తున్నారు.
చింతలపాలెం : సాగర్ నుంచి వస్తున్న వరదతో మండల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టు 11 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలకు ప్రస్తుతం 35.459 టీఎంసీలు ఉన్నది. ఎగువ ప్రాంతాల నుంచి 2,46,601 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ప్రాజెక్టులోని 24 గేట్లలో 6 రేడియల్ గేట్లను 2.50 మీటర్ల ఎత్తు, మరో 5 రేడియల్ గేట్లను 3.00 మీటర్ల ఎత్తు లేపి 2,30,682 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. పవర్ హౌజ్ ద్వారా 16,000 మొత్తం 2,46,682 క్యూసెక్కులు అవుట్ ఫ్లో వెళ్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. తెలంగాణ జెన్కోలో 16,000 క్యూసెక్కుల నీటితో 4 యూనిట్ల ద్వారా 80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నట్లు ఎస్ఈ దేశ్యానాయక్ తెలిపారు.