యాదగిరిగుట్ట, ఏప్రిల్ 6 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా స్వామివారు లక్ష్మీసమేతంగా తెప్పపై నుంచి భక్తులకు అనుగ్రహించారు. ఉత్సవమూర్తులను వివిధ దివ్యాభరణాలు, రంగురంగుల పుష్పమాలికలతో ముస్తాబు చేసి, ప్రధానార్చక బృందం, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయ ధ్వానాలు, మేళతాళాల మధ్య కొండపైన గల విష్ణుపుష్కరిణికి వద్ద తీసుకొచ్చారు. పుష్కరిణి వద్ద స్వామి, అమ్మవార్లను తూర్పునకు అభిముఖంగా వేంచేపు చేసి ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరిణిలో ఉన్న గంగలో సర్వ నదిజలాలు, సర్వ దేవతాలను ఆవాహనం చేశారు. తెప్పకు ఆవాహనం చేసి గంగజాలానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను తెప్పపై వేంచేపు చేశారు.
స్వామిని మేళతాళాల మధ్య తెప్పలో మూడుసార్లు జల విహారం చేశారు. వేద పండితులు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, డోలు సన్నాయి వాయిద్యాల మధ్య తెప్పోత్సవం అద్భుతంగా సాగింది. అనంతరం స్వామి, అమ్మవార్లకు ప్రధానాలయ తిరుమాఢవీధుల్లో ఊరేగించారు. భక్తులు తెప్పోత్సవాలను తిలకించి, పులకించిపోయారు. స్వామివారు విహరించిన గంగజలాన్ని భక్తులు స్వీకరించారు. జలాలను స్వీకరించిన భక్తులకు సర్వదోషాలు తొలగిపోతాయని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. ప్రతి యేటా స్వామివారి విహారయాత్రలో భాగంగా తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, డీఈఓ దోర్బల భాస్కర్‌శర్మ, ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, ఆలయ అధికారులు రఘు, ఊడేపు రామారావు, మహిపాల్‌రెడ్డి, వేద పండితులు, అర్చకులు పాల్గొన్నారు. ప్రధానాలయ పునర్నిర్మాణం కంటే ముందుగా ఉన్న ఆలయంలో తెప్పోత్సవ వేడుకలను ఏడాదికోసారి దేవస్థానం నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణాలు ప్రారంభమైన ఆనంతరం బాలాలయంలో స్వామివారి వేడుకలను కొనసాగించిన నేపథ్యంలో తెప్పోత్సవ వేడుకను తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం ప్రధానాలయ పునఃప్రారంభానంతం తొలిసారిగా వచ్చిన చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా కొండపైన పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించారు.