యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇన్చార్జిల పాలన నడుస్తున్నది. కీలక శాఖలకు పెద్దాఫీసర్లు లేకపోవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారి అడ్మినిస్ట్రేషన్ కుంటుపడుతున్నది. కొత్త పథకాల అమలు తీరుపై ప్రభావం పడుతున్నది. అంతే కాకుండా పెద్ద సంఖ్య లో వివిధ విభాగాల ఫైళ్లు కుప్పలు తెప్పులు పేరుకుపోతున్నాయి. ఫలితంగా జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో కలెక్టర్ తర్వాత కీలకమైన అధికారులు అదనపు కలెక్టర్లు. ఒకరు స్థానిక సంస్థలు, మరొకరు రెవెన్యూ బాధ్యతలు చూస్తుంటారు. కానీ ఏసీఎల్బీ పోస్టు నెల రోజులుగా ఖాళీగా ఉంది. ఇక్కడ అదనపు కలెక్టర్గా పనిచేసిన గంగాధర్ గత నెల 13న హెచ్ఎండీఏ కార్యదర్శిగా బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. రెవెన్యూ అదనపుకు కలెక్టర్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు పర్సన్ ఇన్చార్జి కూడా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలకే ఇచ్చిన విషయం తెలిసిందే.
జిల్లాలో సంక్షేమ శాఖలకు ఇన్చార్జి అధికారులే దిక్కయ్యారు. ఎస్సీ, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలకు జిల్లా అధికారులే లేరు. ఇతర విభాగాల ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిగా ఉన్న జయపాల్ రెడ్డి హైదరాబాద్కు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో హాస్టళ్ల అధికారి వసంత కుమారికి ఇన్చార్జిగా బాధ్యతులు అప్పగించారు. గిరిజన సంక్షేమ శాఖ పోస్టు రెండున్నరేండ్లుగా ఖాళీగా ఉంది. గతంలో పనిచేసిన మంగ్తానాయక్ ఏసీబీకి పట్టుబడటంతో పోస్టు ఖాళీ అయ్యింది. డీఆర్డీఓకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇక మైనార్టీ శాఖ సంక్షేమ శాఖ అధికారి బదిలీపై వెళ్లి రెండేండ్లు దాటింది. ఆయన స్థానాన్ని ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. బీసీ సంక్షేమ శాఖ అధికారి యాదయ్య కు ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పారు.
జిల్లాలో 17 మండలాలు ఉండగా, ఆరు చోట్ల ఇన్చార్జి తాసీల్దార్లతో నెట్టుకొస్తున్నారు. ఇందులో కొందరు సెలవుపై వెళ్లగా, మరికొందరు అవినీతి ఆరోపణలతో సస్పెండ్, పదవి విరమణ పొందారు. భువనగిరి, భూదాన్ పోచంపల్లి, బీబీనగర్, యాదగిరిగుట్ట, మోత్కూరు, గుండాల మండలాలకు తాసీల్దార్లు లేరు. భువనగిరి, యాదగిరిగుట్ట, గుండాల మండలాల తాసీల్దార్లు సెలవుపై వెళ్లడంతో ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు. పోచంపల్లి, మోత్కూరు పదవి విరమణ పొందారు. దీంతో మండలాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక యాదగిరిగుట్ట, భువనగిరి సబ్ రిజిస్ట్రార్లు సైతం ఇన్చార్జిలే కావడం గమనార్హం.
జిల్లాలో కీలక అధికారులు లేకపోవడతో ఫైళ్లన్నీ పెండింగ్లో పడిపోతున్నాయి. వందల కొద్దీ దస్ర్తాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. వేసవి నేపథ్యంలో అనేక చోట్ల నీటి ఎద్దడి నెలకొంది. సదరు సమస్య పరిష్కరించాలంటే ఉన్నతాధికారుల అనుమతి కావాల్సిందే. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసంతోపాటు పలు పథకాలను తీసుకొచ్చింది. వీటి అమలులో కిందిస్థాయి అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. ఇటీవల యువ వికాసం పథకంలో భాగంగా ఆయా సంక్షేమ శాఖలు దరఖాస్తులు స్వీకరించగా, అధికారులకు తిప్పలు తప్పలేదు. భూభారతి కార్యక్రమం తీసుకురావడంతో రెవెన్యూ సదస్సులు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు, క్యాస్ట్, ఇన్కం సర్టిఫికెట్ల జారీ, భూముల పంచాయతీలు తదితర అంశాలతో తాసీల్దార్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మళ్లీ పక్క మండలాలకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.