చండూరు,మే 28: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పొంకణాల పోషిగాని లెక్క మాట్లాడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం ఆయన చండూరులో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో పాటు సబ్బండ వర్గాలకు కష్టాలు తెచ్చిపెట్టిందన్నారు. రైతులు ధ్యాన్యాని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి నెల రోజులవుతున్నా ప్రభుత్వం 50 శాతం కూడా కొనుగోలు చేయలేదన్నారు. ఎప్పుడు కొనుగోలు చేస్తారోనని రైతులు ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ధాన్యం కుప్పలుగా పోశారని, ఎప్పుడు వర్షం వస్తుందోననే ఆందోళనతో ఉన్నారన్నారు.
ప్రభుత్వం 80 శాతం కొనుగోలు చేశామని చెబుతోందన్నారు. అధికార పక్షంలో ఉండి ప్రతిపక్ష ఎమ్మెల్యే మాదిరిగా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై పోరాడుతున్నానంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొంకణాల పోషిగాని లెక్క మాట్లాడుతున్నాడని అన్నారు. ఎమ్మెల్యే ప్రకటనలకే పరిమితం కాకుండా రైతు సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించవచ్చు కదా అని అన్నారు. ఎవరైనా సమస్యలపై ప్రశ్నిస్తే మా ప్రభుత్వానిది పొరపాటే.. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణలు చెబుతున్నా అంటడు.. మీరు వచ్చిన కాన్నుంచి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.. అందుకు ఎన్ని క్షమాపణలు చెబుతారని ప్రశ్నించారు. క్షమాపణలు చెబితే సమస్యలు పరిష్కారమవుతాయా అని కూసుకుంట్ల పేర్కొన్నారు.
నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, గత ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించామన్నారు. ఇప్పుడు వాటిని రెన్యువల్ చేయించి పనులు మొదలుపెట్టే దమ్ము ఎమ్మెల్యేకు లేదన్నారు. గత ప్రభుత్వ హయాంతో తాను మంజూరు చేయించిన రూ.30 కోట్ల నిధులను ఇప్పటికీ ఖర్చు పెట్టి పనులు చేయలేకపోతున్నారని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ పోవాలి..బీఆర్ఎస్ రావాలి..రేవంత్ పోవాలి..కేసీఆర్ రావాలని జనం కోరుకుంటున్నారని అన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుర్రం వెంకట్‌రెడ్డి, కొత్తపాటి సతీశ్, బొమ్మరబోయిన వెంకన్న, పెద్దగోని వెంకన్న, కౌన్సిలర్లు తేలుకుంట్ల రాజకుమారి, సామ సుజాత యాదవరెడ్డి, కొండ్రెడ్డి మధు, నారపాక వసంత ధనయ్య, తేలుకుంట్ల చంద్రశేఖర్, నందికొండ నర్సిరెడ్డి, తేలుకుంట్ల జానయ్య, మందుల సత్యం, దోటి కరుణాకర్, ఇరిగి రామన్న, చొప్పరి దశరథ, కావలి ప్రసాద్, నారపాక శంకరయ్య, బుర్కల శ్రీను, దోటి శ్రీను, కామిశెట్టి ఆంజనేయులు, బొమ్మరబోయిన రమేశ్ తదితరులు పాల్గొన్నారు.