నీలగిరి, ఫిబ్రవరి 14 : రాష్ట్రంలో ప్రజా పాలన ముసుగులో రాక్షస పాలన చేస్తున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే తప్పులు కేసులు పెట్టి, అక్రమ అరెస్టులకు పాల్పడుతారా అని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం అర్ధరాత్రి చండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేత అన్నెపర్తి శేఖర్‌ను అక్రమంగా అరెస్టు చేశారంటూ శుక్రవారం ఉదయం ఎస్పీ శరత్చంద్ర పవార్‌ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో కూసుకుంట్ల మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనను మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించే నాయకులను టార్గెట్ చేస్తూ దాడులు, దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి మరిచి బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిగత దాడులకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. మంత్రి పదవి రాకపోవడంతో సహనం కోల్పోయి గడ్డం పెంచుకుని, లుంగీలు కట్టుకుని తిరుగుతున్నాడని, శాశ్వతంగా మంత్రి పదవి రాకుంటే ఏం చేస్తాడో ప్రజలు అలోచించాలని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజరవర్గ అభివృద్ధికి వందల కోట్ల నిధులు తెస్తే ఇప్పుడున్న ఎమ్మెల్యే కొంతమందికే ఎమ్మెల్యే అన్నట్టు వ్యవహరిస్తున్నారన్నారు.
ప్రశ్నించే నాయకులను ఇబ్బందులకు గురిస్తున్నారని మండిపడ్డారు. చట్టం పోలీస్ యంత్రాంగంపై తమకు గౌరవం ఉందని, న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని తెలిపారు. శేఖర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఆయన అక్రమ అరెస్టును ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు. అనంతరం నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్లో అన్నెపర్తి శేఖర్‌ను ఆయన కలిసి పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు మునగాల నారాయణరావు, గుర్రం వెంకట్‌రెడ్డి, కస్తాల వెంకన్న, పోలగాని సైదులుగౌడ్ ఉన్నారు.