బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాకు రానున్నారు. ఈ నెల 16న భువనగిరి పట్టణంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ శ్రేణుల సన్నాహక సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు పార్టీ కేడర్ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది.
బీఆర్ఎస్ ఆవిర్భవించి పాతికేండ్లు అవుతున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎల్కతుర్తిలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు స్వచ్ఛందంగా తరలించేలా ప్రణాళికలు రూపొందించారు.
ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భువనగిరిలో సన్నాహక సమావేశం నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ బాధ్యులతోపాటు ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 3వేల మంది వరకు ముఖ్య నాయకులు తరలిరానున్నట్లు తెలుస్తున్నది.
శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న కేటీఆర్
సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గం జన సమీకరణ, పెద్దసంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్న జనాన్ని తరలించేందుకు రవాణా ఏర్పాట్లు, సభపై ప్రచారం తదితర అంశాలపై మాట్లాడనున్నట్లు తెలుస్తున్నది. వరంగల్‌కు దగ్గరగా ఉన్న నియోజకవర్గం కావడంతో పెద్దసంఖ్యలో కేడర్‌ను తరలించేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు సమాచారం. గులాబీ శ్రేణుల్లో జోష్ నింపడంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కేటీఆర్ ప్రసంగించనున్నట్లు ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు.
ముమ్మరంగా ఏర్పాట్లు..
భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి నేతృత్వంలో సన్నాహక సమావేశం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌ను బుక్ చేశారు. సుమారు 3వేల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందన్న అంచనాతో అందరికీ భోజన వసతి కల్పించనున్నారు. సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం శేఖర్‌రెడ్డితో ముఖ్య నేతలు సమావేశమై చర్చించనున్నారు. రజతోత్సవ సభకు ఒక్కో నియోజకవర్గం నుంచి 200 బస్సులు తరలివెళ్లనున్నాయి.
ఆలేరు, భువనగరికి సంబంధించి 400 బస్సులను ఇప్పటికే బుక్ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కీలక నేతలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే భేటీ అయ్యారు. తొలుత మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్ సమావేశమయ్యారు. రెండో విడుతలో భాగంగా ఈ నెల 5న మిగతా నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. కాగా, 16న భువనగిరి నిర్వహించనున్న సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు.