నల్లగొండ ప్రతినిధి, మే16(నమస్తే తెలంగాణ) : నల్లగొండ మండలం కంచనపల్లికి చెందిన సైక్లిస్ట్ నిజానపల్లి రమ్యకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఇటీవల ఓ కార్యక్రమంలో రమ్యకు ఇచ్చిన మాట ప్రకారం కేటీఆర్ అత్యంత ఖరీదైన ప్రొఫెషనల్ రేసింగ్ సైకిల్‌ను ఆమెకు బహూకరించారు. శనివారం కేటీఆర్ చేతుల మీదుగా సైకిల్‌ను అందజేస్తూ అంతర్జాతీయ సైక్లింగ్ పోటీలతో పాటు ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న రమ్య కలలు నిజం కావాలని ఆకాంక్షించారు. కంచనపల్లికి చెందిన రమ్య చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఆమె కుటుంబాన్ని చుట్టుముట్టాయి.
అయినప్పటికీ ఆమె అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు అవసరమైన ప్రొఫెషనల్ రేసింగ్ సైకిల్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎక్కడా సరైన స్పందన లభించలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె ‘డాక్టర్స్ క్రికెట్ ఆవార్డ్స్’ కార్యక్రమంలో పాల్గొన్నది. ఈ సందర్భంగా రమ్య తన సైకిల్ రేసింగ్ కల సాకారం కోసం ఒక ప్రొఫెషనల్ గ్రేడ్ సైకిల్ కావాలంటూ మనసులో మాట బయటపెట్టింది. నల్లగొండ జిల్లాకే చెందిన డాక్టర్ శ్రీ రెడ్డి హెర్మియోన్ డనన్ రెడ్డి ఫౌండేషన్ బహూకరించిన ప్రొఫెషనల్ రేసింగ్ సైకిల్‌ను శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డితో కలిసి కేటీఆర్ రమ్యకు అందజేశారు. రమ్య, ఆమె తల్లి అన్నపూర్ణ సంతోషం వ్యక్తం చేశారు.