జరిగిన కథ
నిర్మలానందునికి బౌద్ధ ధర్మం గురించి బోధించి, మరుసటి రోజు ఉదయమే సాధనానందుని కలిసేందుకు వెళ్లుమని చెబుతాడు ఆచార్య మాధవుడు. మేఘచంద్రుని వెంటబెట్టుకుని పోదనకు బయలుదేరుతాడు ముళక రాజు విష్ణుముఖుడు. తర్వాత..
వారం రోజులుగా ఈసాణుడికి నిద్ర సరిగ్గా పట్టడం లేదు. ‘విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమమ్’ అన్నట్లు; ‘దుర్మార్గేవ విజనాతి దుర్మార్గస్త్య ప్రతిక్రియమ్’ కదా! తన చుట్టూ ఏదో కుట్ర జరుగుతున్నట్లు అతనికి అనుమానం కలిగింది. సరైన ఆధారాలే దొరకడం లేదు. కుసుమ శ్రేష్ఠి ప్రవర్తనలో మార్పు కనిపిస్తున్నది. చిలుకవాడ మహాగణిక సవరసత్తిలో ఆనందం తాండవిస్తున్నది. చిలుకవాడ నుంచి తనవెంట తెచ్చుకున్న వృద్ధుడు మియంకుని పట్ల చాలా అనుమానాలున్నాయి. ఇవన్నీ ఇట్లా ఉండగా.. అవణాయరు ఈ మధ్యకాలంలో తన మందిరం విడిచి బయటికి రావడమే లేదు. చూస్తుంటే వీటన్నిటికీ ఏదో సంబంధం ఉన్నట్లే మనసుకు అనిపిస్తున్నది. ఆలోచిస్తున్న కొద్దీ తలనొప్పి అధికమవుతున్నది అతనికి. వెంటనే మియంకుని పిలిపించి, తల పట్టుమన్నాడు. మియంకుడు మౌనంగా, శ్రద్ధగా తన పని చేస్తున్నాడు. ఈసాణుడికి అప్పుడు కల్లణసీహుడు గుర్తుకొచ్చినాడు. ‘వాడే ఉంటే ఇటువంటి కుట్రలను, కుతంత్రాలను క్షణంలో కనిపెట్టేవాడు. నేనే ఆవేశంతో ఈ చేతులతోనే చంపేసినాను..’ అనుకుంటుంటే కన్నీరు తన్నుకొచ్చింది. “ప్రభూ! ఏదైనా అపచారం జరిగిందా?”.. ‘తల పట్టడంలో పొరపాటు జరిగిందేమో!?’ అన్న ఆందోళనను వ్యక్తపరిచినాడు మియంకుడు.
“పొరపాటు నీది కాదురా నాది..” తనలో తాను అనుకుంటున్నట్లు, పశ్చాత్తప్తుడై అన్నాడు మెల్లగా ఈసాణుడు. తనను గురించి ఏదో ఆధారం దొరికిందేమో అనుకున్నాడు మియంకుని రూపంలో ఉన్న పోటిసుడు. సరిగ్గా అప్పుడే ఒక పరిచారిక అక్కడికి వచ్చి.. “అల్లడు తమ దర్శనం కోరుతున్నాడు ప్రభూ!” అని నివేదించింది. “వానికి నాతో ఏం పని? ఎక్కడ ఉండవలసిన వాడు అక్కడ ఉండాలి! కుదరదని పంపించు..” చిరాగ్గా అన్నాడు ఈసాణుడు. బయటికి పోయిన కన్నీటి ప్రభావమో, మియంకుని సేవాపటిమ వల్లనో.. అతని తలనొప్పి చాలా వరకు తగ్గింది. అంతలోనే ఏదో గుర్తుకొచ్చింది. వెళుతున్న పరిచారికను ఆపి.. “ఆఁ అల్లడు అంటే.. అవణాయరు మందిర రక్షకుడు కదా!” అన్నాడు. “చిత్తం ప్రభూ! అతనే!” నిర్ధారించింది ఆమె. “అయితే రమ్మను!” అన్నాడు వెంటనే. ‘వాడైతే అవణాయరు మందిరంలో ఏం జరుగుతుందో చెప్పగలడు’ అనిపించింది. మరు నిమిషంలో వాడు ద్వారంలో చేతులు కట్టుకొని నిలబడ్డాడు. “ఏమిటి సంగతి? మాతో విన్నవించుకోదగినంత ముఖ్యమైన విషయాలు ఏమున్నాయి నీకు?” హూంకరిస్తూ, పడుకున్న చోటి నుంచే అన్నాడు ఈసాణుడు. వాడు వెంటనే జవాబు ఇవ్వలేదు. “అడుగుతున్నది నిన్నే!” అసహనంగా అన్నాడు ఈసాణుడు. “మాట్లాడవలసి ఉన్నదని చెప్పి మౌనంగా నిలబడతావేం! మెడకాయ మీద తలకాయ ఉండాలనుకుంటున్నావా? పోవాలనుకుంటున్నావా?” “చిత్తం మహారాజా! ఒక ముఖ్యమైన విషయం మనవి చేయడానికే వచ్చినాను..” అన్నాడు అల్లడు చాలా వినయంగా. “మరి చెప్పి ఏడువ్” మరింత కఠినంగా అన్నాడు రాజు కాని రాజు ఈసాణుడు.
మళ్లీ మౌనాన్ని ఆశ్రయించినాడు అల్లడు. ఈసాణుడి కోపం నసాళానికి అంటింది. గబుక్కున లేచి సర్రున కత్తి దూసినాడు. అది వాడి గొంతు కానించి.. “ఏం.. నాటకాలు ఆడుతున్నావా? ఎవరి ముందు మాట్లాడుతున్నావో తెలుసా?” అన్నాడు. వాడు బెదరలేదు కానీ, పక్కనే ఉన్న పోటిసుడు ఖంగు తిన్నాడు. ‘ఈసాణుడి అధికారం పిచ్చివాని చేతిలో రాయి!’ అనిపించింది. అంతలో.. అల్లడు గొంతు విప్పినాడు. “ప్రభూ! నేను చెప్పవలసిన విషయం మీకు ఏకాంతంగా చెప్పవలసి ఉన్నది!” అన్నాడు నిశ్చలంగా. వాని మాటలోని గాంభీర్యం, మనసులోని దృఢత్వాన్ని ప్రకటిస్తున్నది. మెల్లగా కత్తిని వెనుకకు తీసుకున్నాడు ఈసాణుడు. తమతోపాటు అక్కడున్నవాడు మియంకుడు ఒక్కడే! వాణ్ని బయటికి పంపుమన్న సంకేతం అల్లని మాటల్లో స్పష్టమైంది. “ఒరేయ్! నీవు అవతలికి పో!” మియంకుని బయటకి పంపినాడు ఈసాణుడు. ‘ఇదేదో మాకు సంబంధించిన విషయమే! ఈ అల్లడు ఎవరు? వీనికి తెలిసిన నిజం ఏమిటి? అవణాయరు అంటే అంతఃపుర రక్షకుడని సవరమ్మ తెలిపింది కదా! అతని మందిర కాపలాదారు వీడంటే, వీనికి మా మనుషులు..’ అప్పుడు గుర్తుకొచ్చింది పోటిసునికి. ‘మొదట రాజగృహంలోకి ప్రవేశించింది వామదేవుడు, సౌగంధికలే కదా! వాళ్లు అవణాయరు వద్దనే ఆశ్రితులై ఉన్నారు. అంటే.. ఈ కాపలాదారు అల్లనికి వాళ్ల సంగతి తెలిసిందా?’ అనుకొని ఉలిక్కిపడ్డాడు మియంకుని వేషంలోని పోటిసుడు.
పోటిసునితో తన పెళ్లి జరిపిస్తానన్న పెద్దరాణి మాటలు అలసుద్ది మనసును గాలిలో తేలిపోయేటట్లు చేసినాయి. పోదనలో అంతఃపురంలో ఉన్నప్పుడు మహారాణి సిరిసత్తిని చూస్తే చాలు భయభక్తులతో నోట మాట రాకపోయేది. రోహాదేవి కొత్తకోడలుగా ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి తన ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చింది. ఆ చిన్నరాణి తనను చెల్లెలుగా భావించినప్పటి నుంచి చనువు మరింత పెరిగి, తానూ అంతఃపుర కాంతనే అనిపించడం మొదలైంది. ఆ తర్వాత వెంటవెంటనే ఊహించని పరిణామాలెన్నో జరిగినాయి. వాటిలో మొట్టమొదటిది పోటిసుడు కళింగకు వెళ్లడం. పోటిసుడు నిజంగానే పోటుగాడు! కండలు తిరిగిన శరీరం; కాంతి నిండిన ముఖం; నూనూగు మీసాలు; కొండంత బలం.. అన్నిటికీ మించి తనను చూడగానే వాని కళ్లలో మెరిసే కాంతి! హుఁ.. పాడు దేవుడు! వాడు తనకు దగ్గరవుతున్న క్షణంలోనే దూరం చేసినాడు! అయినా వాడు ఎక్కడికి పోతాడు? ఎప్పటికైనా పోదనకు రావలసిన వాడే కదా! యజమాని కోసం కాకపోయినా, తన కోసమైనా వెతుక్కుంటూ రాక తప్పదు! వాడు చెప్పకపోయినా, వాని కళ్లు నిర్లజ్జగా తనమీద ప్రేమను ఎప్పటికప్పుడు కొత్తగా ప్రకటించేవి.. మహారాణి గారు వానితో తన పెళ్లి జరిపిస్తానని అనేసినారు కదా! ఆమె మాటంటే మాటే! తిరుగుండదు! అయినా.. చూడనొక్క తీరు చొప్పున నగపడు అక్షరములు పదము లన్ని కూడ వాటిలోన ప్రేమ వర్తిల్లునవి యేవొ, ఏవి యిచ్చకములొ యెరుగు మనసు!
(అక్షరాలు, పదాలు చూడటానికి ఒకేలా అనిపించినా, ఎదుటివాళ్లు మాట్లాడే మాటల్లో నిజమైన ప్రేమ నిండిన వాక్యాలు ఏవో; ఇచ్చకాలు ఏవో మనసు సరిగ్గానే పసిగడుతుంది) ‘మహారాణి గారి ప్రేమ గొప్పది; ఆలోచన అనుసరించ తగినది; మాట ముత్యాల మూట; పోటిసునితో తన పెళ్లి తప్పక జరిపిస్తుంది! ఇన్ని రోజులు వాడు కనిపించక పోవడమే అంతుచిక్కడం లేదు! తనను చూడటానికైనా వెంటనే రావలసింది కదా! అసలు ఎట్లా ఉన్నాడు? ఎలా ఉన్నాడు’.. అనుకుంటూ పనులన్నీ పూర్తి చేసుకుని, బయటికి వచ్చి, ఆరు బయట అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తున్నది ఆహవసత్తి (అలసుద్ది). “ఏం పిల్లా! పనుంది వస్తావా?” అన్న పిలుపు విని, ఉలిక్కిపడ్డది. ఎదురుగా సచ్చసామి!!! ఒక్కసారిగా ఆహవకు ఒళ్లు జలదరించింది. “మెడ పట్టుకొని గెంటినా, చూరు పట్టుకుని వేలాడుతున్నట్లు.. ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా చెప్పినా నీ సిగ్గుమాలినతనం వదలవా?” తెగించి మొహం మీదనే అనేసింది ఆహవ. “మీ అక్క తన అందం వదిలేసిందా? నీవు నీ గడుసుదనం వదిలేసినావా? మీ అత్త తన మంచితనం వదిలేసిందా? లేదే! మరి నేనెట్లా నా స్వభావం వదులుతాననుకున్నావు చిన్న పాపా? అయినా మీరు ఈ ఊరొచ్చింది పనికోసమే; నేను రమ్మంటున్నదీ పనికోసమే! పిలిచినప్పుడు రావాలి కదా!” అన్నాడు వంకరగా నవ్వుతూ సచ్చసామి. “తమరు మాటలతో వినకుంటే మేము ఏం చేయాలో నాకు బాగా తెలుసు..” అంటూ, ఇంకా ఏదో అనబోయిన ఆహవను అత్త అడ్డుకున్నది. “ఎవరమ్మా! ఆ వచ్చినవారు..?” అంటూ. ఆ మాటలు విని గతుక్కుమన్నాడు సచ్చసామి.
‘ఈ ముసలి దానికి కండ్లు కనిపించవు గానీ, చెవులు మాత్రం పాము చెవులే!.. ఇప్పుడేం చెప్పాలి?’ అని ఆలోచనలో పడ్డాడు. “అతనే అత్తమ్మా! ఉదయం వచ్చిన సచ్చినోడు..” అన్నది చివరి మాట వినీ వినిపించనట్లు. “ఏందే.. సచ్చినోడా?” అన్నది నిర్ధారణగా కమలసత్తి. ఆమె వినికిడి జ్ఞాన తీవ్రత ఆహవను ఆశ్చర్యపరిచింది. “అదే అత్తమ్మా.. సచ్చసామి.. అన్నాను” అన్నది.. అన్న మాటను కప్పిపుచ్చుతూ. “అయ్యో పాపం! ఈ ఊరి పెద్దరైతు! ఊరికే రాడు కదా! లోపలికి తీసుకొని రా! నేను మాట్లాడతాను..” అన్నది కమల. ‘వీడు తుమ్మజిగురులా తగులుకున్నాడు. మరోమారు ఇటువైపు రాకుండా చేయాలి!’ అనుకున్నది మనసులో. ఇంటి లోపలికి వెళ్లక తప్పలేదు సచ్చసామికి. “తల్లీ! నీవు లోపలికి పోయి, చల్ల కలుపుకొని రా! ఈలోగా నేను ఈ మహానుభావునితో మాట్లాడతాను” అన్నది ఆహవతో. ఆ మాట వెనుక.. ‘నేను మాట్లాడటం పూర్తయ్యే వరకు నీవు రాకూడదు’ అన్న సంకేతం కూడా దాగున్నది. “సచ్చసామీ! కూర్చో నాయనా! ఈ ఉదయమే తమరి సానుభూతి, సహకారం అవసరం లేదని చెప్పినాను కదా! అయినా ఈ గడప తొక్కినావంటే, నిన్నెవరో ఆహ్వానించి ఉండాలి; లేదా ఏదో అత్యవసర పరిస్థితి ఏర్పడి ఉండాలి..” అన్నది అసలు కారణం చెప్పుమని, అన్యాపదేశంగా. “అవును పెద్దమ్మా! అత్యవసరం ఏర్పడే వచ్చినాను” అన్నాడు అప్పటికప్పుడు ఏం చెప్పాలోనని ఆలోచిస్తూ. “ఓహో! ఏమిటో అత్యవసర కార్యం. అయినా, అబలలం మేమేం సాయం చేయగలం నాయనా!” అని కొంచెం వెటకారంగా అన్నది కమల.
ఠక్కున గుర్తుకొచ్చింది సచ్చసామికి.. “జనప చేను కోతకొచ్చింది. ఊళ్లో పనివాళ్ల కొరత ఉన్నది. ముందుగా మీ ఇద్దరు కోడళ్లకు చెప్పి ఉంచుదామని వచ్చినాను..” అన్నాడు. “అవునా నాయనా!” అన్నది కమలసత్తి. జనప కోతకు ఇంకా నెలరోజులన్నా పడుతుందని ఆమెకు తెలుసు. ఈ వంకతో ఏదో విధంగా ఆహవతో మాట్లాడాలన్న అతని దురూహ ఆమెకు అర్థమైంది. అందుకే యుక్తియుక్తంగా.. “నా కొడుకు వచ్చేసినాడు. మా కష్టాలు తీరినాయి. మేం తప్పని పరిస్థితుల్లో ఇక్కడ తలదాచుకుంటున్న నిర్భాగ్యులం. నిజానికి కూలి నాలి చేసి బతకడం మాకెప్పుడూ తెలవదు. మా ఇళ్లలోనే వందమంది పనిచేసే వాళ్లు ఉండేవాళ్లు ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితి బాగాలేక ఇట్లా గడుపుతున్నాం. ఇక ఈ వారంలోగా మా స్వస్థలానికి వెళ్తాం. ఇంకెప్పుడూ.. ‘సహకరిస్తా.. సేవ చేస్తా!’ అంటూ ఇటువైపు రావద్దని నా మనవి. అంతగా అవసరం అయితే నా కొడుకే మీ ఇంటికి వస్తాడు. వీలైతే అప్పుడు సహకరించండి!” అన్నది కమలసత్తి. బాట పూర్తిగా మూసేయడంతో నోట మాట రాలేదు సచ్చసామికి. అదే సమయంలో అతనిలో పట్టుదల పెరిగింది. ‘ఈ ఆడవాళ్ల వెనుక ఏదో కథ ఉన్నది. అది తెలుసుకోవాలి’ అనుకున్నాడు. అందుకే తన మార్గం మార్చుకున్నాడు. “క్షమించాలి పెద్దమ్మా!” పశ్చాతాప పడుతున్నట్టుగా అన్నాడు.. “మీరు కూడా అందరిలాగే పని వెతుక్కుంటూ వచ్చినారు అనుకున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే మీ కథ చెబుతారా?” ఈసారి ఆడవాళ్లిద్దరూ ఖంగుతిన్నారు. లోపల మజ్జిగ కలుపుతున్న ఆహవసత్తి; బయట జిడ్డులా అంటుకున్న సచ్చసామితో సతమతమవుతున్న కమలసత్తి.
అయినా ఇటువంటి పరిస్థితి ఎప్పుడో ఒకప్పుడు ఏర్పడుతుందని మహారాణికి తెలుసు. అందుకే యుక్తియుక్తంగా సమాధానం చెప్పింది.. “విధి నాయనా! ఇది విధి! మనమంతా కాలం వలలో విలవిలలాడే చేపలం. అది ఎవరిని ఏ సమయంలో పట్టుకుంటుందో! ఎవరి ప్రాణాలను తీస్తుందో! ఎవరిని జారవిడుస్తుందో.. ఎవరికి ఎరుక? అది మాపై కక్షగట్టి మా బతుకులను ఇట్లా కకావికలం చేసింది..” “నిజమే పెద్దమ్మా! విధికి ఎదురేగడం అంటే పాము కోరలతో ఆటాడుకున్నట్లే! ఇంతకూ మీది ఏ రాజ్యం? ఎందుకు మా ఊరు వెతుక్కుంటూ వచ్చినారు? అక్కడ మీకు ఎదురైన పరిస్థితులేవి? వివరంగా చెప్పండి!” అన్నాడు. “చెప్తాను! ఈ ఊర్లో అంతో, ఇంతో పరిచయం ఉన్నది నీవే కదా! నీకు గాక ఇంకెవరికి చెప్తాం?”. సచ్చసామి కళ్లు మెరిసినాయి. ఆమె అంత తొందరగా సమాధానం ఇస్తుందని అతను ఏమాత్రం ఊహించలేదు. అయితే కమలసత్తి గురించి అతనికి పూర్తిగా తెలవదు కదా! తమ గురించి చెప్పడానికి ఆమె ఒక మెలిక పెట్టింది.. “అయితే ఆ వివరాలు చెప్పేముందు నీవు నాకొక చిన్న పని చేసి పెట్టాలి!” అన్నది. “ఏం చేయాలి పెద్దమ్మా?” ఆ రహస్యం తెలుసుకునేందుకు ఏమైనా చేయగలనన్న ధీమా అతని గొంతులో ధ్వనించింది. “మా బంధువులు పోదన నగరంలో ఉండేవాళ్లు. నీకు పోదన నగరం తెలుసా?” అన్నది. “తెలుసు కానీ.. చాలా దూరం!” గుర్తు చేసుకుంటూ అన్నాడు సచ్చసామి. “ఆ పోదనలో కుసుమ శ్రేష్ఠివాళ్లు మాకు బంధువులు. నీవు ఆ నగరానికి వెళ్లి, వాళ్ల కుటుంబం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి! వాళ్ల వద్ద పనిచేసే కువిందుడు అనే మహావీరుని ఆచూకీ తెలుసుకోవాలి!” అన్నది.