హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గాంధీభవన్లో ఆదివారం మాట్లాడుతూ.. పీసీసీ క్రమశిక్షణా కమిటీకి ఆయన ఇచ్చిన వివరణలో అన్నీ అబద్ధాలే ఉన్నాయని పేర్కొన్నారు.
ఆయన వివరణతో తాను సంతృప్తి చెందలేదని, వెంటనే చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. క్రమశిక్షణా కమిటీకి చిన్నారెడ్డి ఆడియో, వీడియోలు ఇచ్చానని, కమిటీ మళ్లీ పిలిస్తే వచ్చి నా వాదన వినిపిస్తా అని మేఘారెడ్డి పేరొన్నారు. కాంగ్రెస్ నాయకుడినని గొప్పలు చెప్పుకొనే చిన్నారెడ్డి ప్రతిపక్ష నాయకులతో సన్నిహితంగా మెలగడం ఎవరి ప్రయోజనాల కోసమో చెప్పాలని డిమాండ్ చేశారు.