కాంగ్రెస్ సర్కార్ పెద్దల ధనదాహానికి అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. నగరాలు, పట్టణాలు సహా పల్లెలను సైతం ‘నిషేధం’ కింద తొక్కిపట్టి సామాన్యుల జీవితాలతో రేవంత్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. ఇప్పటికే మహానగరంపై పడగవిప్పిన ‘22ఏ’ సర్పం జిల్లాలనూ చెరబట్టింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాపైనా ‘నిషేధిత’ పంజా విసిరింది. వేలాది ఎకరాల భూములు, ప్రజల ఆస్తులు ఈ జాబితాలో చిక్కుకున్నాయి. చెరనుంచి తమ భూములు, ఆస్తులను విడిపించుకొనేందుకు బాధిత ప్రజలు అరిగోస పడాల్సిన దుస్థితి దాపురించింది.
కరీంనగర్ జిల్లాలో ఏకంగా 62 వేల ఎకరాలను అధికారులు 22ఏలో చేర్చారు. ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోనే 2,000కు పైగా నివాసాలు, కరీంనగర్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లో 12వేల ఎకరాలకుపైగా భూములకు కళ్లెం వేశారు.సర్కార్ గుప్పిట నుంచి ఆస్తులు, భూములను విడిపించుకొనేందుకు నెత్తీనోరు బాదుకుంటూ బాధితు లు కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ‘నిషేధం ఎత్తివేతపై ఆదేశాలు రాలేదు’ అంటూ అధికారులు చేతులెత్తేస్తుండటం తో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. విసిగి వే సారిన బాధితులంతా సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌ను ముట్టడించాలని నిర్ణయించారు.
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో శాతవాహన విశ్వవిద్యాల యం ఎదుట, ఆర్టీసీ వర్క్‌షాపు వెనుక భాగాన ఉన్న ఇండ్లు ఇవి! జిల్లా కోర్టుకు కూతవేటు దూరంలో ఉన్న కాలనీలోని ప్రతి ఇంటితో పాటు కొత్తయాస్వాడ, హరిహరనగర్, విద్యానగర్, కాళోజీనగర్, రేకుర్తి, ఆర్టీసీ వర్క్‌షాప్, శ్రీరాంనగర్కాలనీలోని వేలాది ఇండ్లు 22ఏ జాబితాలో చిక్కుకొన్నాయి.

కరీంనగర్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కరీంనగర్ విద్యానగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై 22-ఏ పం జా విసిరింది. వేలాది ఎకరాల భూములు, ఆస్తులు ఆ నిషేధిత జాబితాలో చిక్కుకొన్నాయి. దీంతో ఆ జాబితా నుంచి తమ భూములు, ఆస్తులను విడిపించుకొనేందుకు బాధిత ప్రజలు నానాయాతన పడుతున్నారు. జిల్లాలో ఏకంగా 62వేల ఎకరాల భూములు ఈ నిషేధిత జాబితాలోకి చేర్చా రు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోనే 2,000కు పైగా నివాసాలను ఆ జాబితాలోకి చేర్చారు.
కరీంనగర్, కరీంనగర్ రూ రల్, కొత్తపల్లి మండలాల్లోనే 12వేల ఎకరాల పైచిలుకు భూ ములు ఈ నిషేధిత జాబితాలో చేర్చారు. విచిత్రం ఏందంటే? సమైక్య రాష్ట్రంలో పట్టాదారు పాస్ పుస్తకం, ఆర్డీవో జారీచేసిన భూయాజమాన్యపు హక్కుపత్రం పొంది దశాబ్దాలుగా సాగుచేసుకొంటున్న వందలాది భూములను 22-ఏ కింద చేర్చారు. వీటిని తొలగించాలంటూ ప్రజావాణితోపాటు తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా.. అధికారిక ఆదేశాలు తమకు అందలేదంటూ యంత్రాంగం దాటవేస్తున్నది. దీంతో దిక్కుతోచని స్థితిలో బాధిత ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పూటకోమాట చెప్తున్న తీరుపై అనేక విమర్శలు వ్యక్తవుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో విసిగి వేసారిన బాధితులంతా సోమవారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టాలని నిర్ణయించారు. నగరంలోని 19,20,21వ డివిజన్ల పరిధిలోని రేకుర్తి, విద్యానగర్ ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రజలతో కలిసి ఈ ముట్టడి నిర్వహించనున్నట్టు రేకుర్తి, విద్యానగర్ ప్రాంతాల్లోని 22ఏ భూబాధితుల జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఆదివారం రేకుర్తిలో సమావేశమైన బాధితులు.. రేపు ఉదయం 9 గంటల నుంచి కలెక్టరేట్ వద్దకు చేరుకొని ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
నిషేధిత జాబితాలో వేలాది ఎకరాలు
ప్రధానంగా కరీంనగర్ కార్పొరేషన్ సమీప మండలాల్లోని 20 గ్రామాల్లో సుమారు 25 వేల ఎకరాలు ఈ నిషేధిత జాబితాలో చేర్చారు. కొత్తపల్లి మండలంలోని కొత్తపల్లి (హవేలి), రేకుర్తి పరిధిలో సుమారు 4 వేల ఎకరాలు, వందలాది ఇండ్లను 22-ఏ జాబితాలో చేర్చారు. కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లో గతంలో ఎప్పుడూ నిషేధిత జాబితాలో లేని భూములను 22-ఏలో చేర్చారు. సమైక్య ప్రభుత్వ హయాంలోనే అనేక రిజిస్ట్రేషన్లు జరిగి తహసీల్దార్ జారీచేసిన పట్టాదారు పాస్‌పుస్తకం, ఆర్డీవో జారీచేసిన భూయజమాన్య పత్రంతోపాటు మ్యుటేషన్ జరిగి.. సదరు సర్వేనంబర్లలో నాలుగైదు సార్లు రిజిస్ట్రేషన్ల ద్వారా క్రయ విక్రయాలు జరిగి, సర్కార్‌కు ఆదాయం సమకూరిన అనేక వ్యవసాయ భూములనూ నిషేధిత జాబితాలో చేర్చారు.
గతంలో ధరణిని కొత్తగా తీసుకొచ్చే సమయంలో ఆన్లైన్లో వివరాలు అప్లోడ్ చేసే ముందు రెవెన్యూ అధికారులు.. సర్వేనంబర్ వారీగా నోటీసులు ఇచ్చి అభ్యంతరాలు, ఇతర వివరాలను సరిచూసి ఆన్లైన్ చేసిన తర్వాతే ఆనాటి తెలంగాణ ప్రభుత్వం కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను జారీచేసింది. అటువంటి పట్టాభూములెన్నో ఇప్పుడు 22ఏ నిషేధిత జాబితాలోకి చేర్చారు. అలా కొత్తపల్లి మండలంలోని కమాన్‌పూర్, ఖాజీపూర్, లక్ష్మీపూర్, మల్కాపూర్, నాగుల మల్యాల, సీతారాంపూర్, కరీంనగర్ రూరల్ మండలం ఆరెపల్లి, బొమ్మకల్, దుర్శేడ్, ఇరుకుల్ల వంటి గ్రామాల్లో ఇదే పరిస్థితి! జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలను ఆనుకొని ఉన్న గ్రామాల్లో వేలాది ఎకరాలది కూడా అదే దుస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పట్టణాలకు సమీపంలోని ఎనిమిది గ్రామాల్లోనూ వందలాది ఎకరాలు నిషేధిత జాబితాలోకి వెళ్లిపోగా, పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇదే దుస్థితి ఉన్నది.
పొంతన లేని మంత్రి మాటలు
సమస్యను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. అసలు తప్పే జరుగలేదన్నట్టు వాదించింది. అంతేకాదు, గతంలో ధరణిలో ఉన్న భూములనే తాము నిషేధిత జాబితాలో పెట్టామంటూ గత సర్కార్‌పైకి నెపం నెట్టే ప్రయత్నం చేసింది. అంతేకాదు.. 22-ఏలో చేర్చిన జాబితా అంతా సరిగానే ఉందని వాదించే ప్రయత్నమూ చేసింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా మంటలు అంటుకున్నాయి. బాధితులు అన్ని జిల్లాల్లో ఆందోళన చేపట్టారు. బాధితుల పక్షాన బీఆర్ఎస్ నిలిచింది. దీంతో సర్కార్ ఒక్కసారిగా సంకట స్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి పూటకో మాట చెబుతుండగా.. చివరికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. విచిత్రం ఏందంటే? ఈ విషయంలో నెలలు గడుస్తున్నా.. ఏ ఒక్క అంశంలో నేటికీ క్లారిటీ రాలేదు. ఆయా సందర్భాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడిన మాటలను నిశితంగా పరిశీలిస్తే.. ఈ అంశంపై మంత్రికి పట్టు ఉన్నదా? లేదా? లేక కావాలనే ఇలా సాగదీస్తున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
తొలగింపు సామాన్యులకు సాధ్యమేనా?
భూభారతి ప్రకారం చూస్తే 22ఏ జాబితాలో చేర్చిన వాటిని పట్టా భూములని నిరూపించుకోవడానికి ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒక సామాన్యుడు, లేదా రైతు ముందుకెళ్లగలడా? లేదా? అన్నదానిపై సర్కార్ ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 22 ఏ జాబితాలో ఉంటే ఒక దరఖాస్తు ఇస్తే చాలు.. పరిష్కరిస్తామంటూ మంత్రి పొంగులేటి చాలా సింపుల్‌గా చెప్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ వ్యవస్థలో ఇది సాధ్యమయ్యే పనేనా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. 22-ఏ జాబితాలో పెట్టిన భూమిని తొలగించాలంటే.. సదరు రైతు, లేదా వ్యక్తి ముందుగా దరఖాస్తు ఇస్తూ వాటికి సంబంధించిన కచ్చితమైన ఆధారాలను ఇవ్వాలని భూభారతి చెప్తున్నది.
ముందుగా దానిపై గ్రామపాలన అధికారి (జీపీవో) నివేదిక తయారు చేసి తహసీల్దార్ ఆఫీస్‌లోని ఆర్ఐకి అప్పగించాలి. ఆయన పరిశీంచి తహసీల్దార్‌కు, అక్కడి నుంచి ఆర్డీవో, డీఆర్వో, అదనపు కలెక్టర్, కలెక్టర్ వరకు ఈ నివేదిక వెళ్లాలి. కలెక్టర్ ఆ నివేదిక సీసీఎల్ఏకు పంపించాలి. సీసీఎల్ఏ అధికారులు పరిశీలించి, అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ శాఖకు ఉత్తర్వులు ఇవ్వాలి. వారు 22-ఏ జాబితా నుంచి సదరు సర్వేనంబర్‌ను ఎత్తివేయాలి. నిజానికి రెవెన్యూ శాఖలో ఏ ఫైలు కదలాలన్నా ముడుపులు లేకుండా ముందుకు సాగదన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది 22-ఏ నిషేధిత జాబితా నుంచి భూమిని ఎత్తివేయాలంటే.. ఓ సామాన్యుడు ఈ విధానంలో ముందుకు వెళ్లగలడా? అన్నది సర్కార్ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దీనిపై లోతైన పరిశీలన చేసి.. సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటే తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రశ్నలకు బదులివ్వండి పొంగులేటి గారూ!
..పక్క ఫొటోలో కనిపిస్తున్న ఇండ్లు.. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో సాక్షాత్తు శాతవాహన విశ్వవిద్యాలయం ఎదుట, ఆర్టీసీ వర్క్‌షాపు వెనుక భాగాన ఉన్నాయి. జిల్లా కోర్టుకు కూతవేటు దూరంలో ఉన్న కాలనీలోని ప్రతి ఇల్లూ 22-ఏ నిషేధిత జాబితాలోకి వెళ్లింది. నగర పరిధిలోని కొత్తయాస్వాడ, హరిహరనగర్, గౌడ కాలనీ, షేకాబ్కాలనీ, లక్ష్మీనరసింహకాలనీ, విజయపురి, మామిడితోట ఏరియా, వెంకటేశ్వర కాలనీ, హిందూపురి, విద్యానగర్, కాలోజీనగర్, రేకుర్తి, ఆర్టీసీ వర్క్‌షాప్, శ్రీరాంనగర్‌కాలనీ తదితర ప్రాంతాల్లో వందలాది ఇండ్లు ఇప్పుడు ఈ నిషేధిత జాబితాలోకి వెళ్లాయి.
ఇక్కడ మెజారిటీ ప్రజలు దాదాపు మూడు దశాబ్దాల క్రితమే ఇండ్లు నిర్మించుకొని నివాసాలు ఉంటున్నారు. ఆ ఇండ్లకు అన్నిరకాల అనుమతులున్నాయి. పలుసార్లు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో క్రయ విక్రయాలు జరిగాయి. లీగల్ ఒపీనియన్తోపాటు బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. ఇప్పుడు అదే భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో వేలాది మంది ఆందోళన చెందుతున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. ప్రయోజనం లేకుండా పోతుంది. పలుసార్లు కలెక్టర్‌ను కలిసి విన్నవించినా నేటికీ సమస్యకు పరిష్కారం దొరుకలేదు.
మంత్రి పొంగులేటి పూటకో మాట!
ఆగస్టు 11:కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా 22-ఏలో ఎటువంటి భూములను చేర్చలేదు. గత ధరణిలో ఉన్న భూములే 22-ఏలో కొనసాగుతున్నాయి.
ఆగస్టు 17: ఆందోళన పెరుగడంతో కొంత మేరకు దిగొచ్చిన మంత్రి.. నిజమైన హక్కుదారుడి ఒక్క గజం కూడా పోనివ్వమని, అర్హులైన కేసులకు ప్రాధాన్యం ఇస్తామంటూ ప్రకటించారు.
ఆగస్టు 17:ఆందోళన ఉధృతం కావడంతో మంత్రి మాట మార్చారు. జరిగిన లోపాలను అధికారులపైకి నెట్టేశారు. అధికారుల తప్పిదం వల్ల ప్రైవేట్ భూములు కూడా 22-ఏ నిషేధిత జాబితాలో చేరాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నందుకు క్షమాపణలు చెప్తున్నామని పేర్కొన్నారు. తప్పు జరిగింది క్షమించండి.. అంటూ బాధిత ప్రజలకు చెప్పారు. యుఎల్‌సీ /కోర్టు రికార్డులు ఆన్లైన్లో సరిగా నమోదు కాకపోవడం వల్లే కొన్ని ప్రైవేట్ భూములు 22-ఏలోకి వచ్చాయని పేర్కొన్నారు.
ఆగస్టు 18: అర్హత ఉన్న ప్రైవేట్ భూములను పరిశీలించి 22- ఏ నుంచి తొలగిస్తామంటూ ప్రకటించారు.
ఆగస్టు 19: ప్రైవేట్ భూమి అని తేలితే రెండు రోజుల్లో పరిశీలించి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తామని చెప్పారు.
ఆగస్టు 20: 22-ఏ ఫిర్యాదులను స్పెషల్ టాస్క్‌గా తీసుకొని, క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించాలంటూ అధికారులను అదేశిస్తున్నట్టుగా చెప్పారు.
పేదల భూములపై కత్తి పెట్టారు
22-ఏ నిషేధిత భూముల జాబితా విషయంపై అధికారులను సంప్రదిస్తే మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్తున్నారు. కరీంనగర్ చుట్టుపక్కల సుమారు 800 ఎకరాల భూములను 22-ఏ జాబితాలో చేర్చారు. 50 ఏండ్లుగా ఆ భూముల్లో సాగు చేసుకుంటూ, ఇండ్లు నిర్మించుకొని నివసిస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాం. కొన్ని భూములపై ప్రభుత్వం, బ్యాంకులు రుణాలు కూడా తీసుకున్నాం. ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి అర్హులైన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి న్యాయం చేయాలి. ప్రభుత్వం స్పందించకపోతే మాభూముల పరిరక్షణ కోసం ఉద్యమం చేపడుతాం.
-పాశం మోహన్‌రెడ్డి, బాధితుల సంఘం కన్వీనర్ (కరీంనగర్ విద్యానగర్)
పిల్లల చదువులకు ఆటంకం
ఎన్నో ఏండ్లుగా శ్రీరామ్‌నగర్ కాలనీలో నివసిస్తూ సొంతంగా ఇల్లు కట్టుకున్నా. డబ్బులు పెట్టి భూమి కొనుగోలు చేసి, ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నా. గతంలో ఇదే భూమిపై బ్యాంకు రుణం తీసుకున్నా. అలాంటి భూములను ఇప్పుడు 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నా. నా పిల్లలను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించేందుకు బ్యాంకు రుణం కోసం వెళ్లగా, భూములు 22ఏ జాబితాలో ఉన్నందున రుణం ఇవ్వలేమని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో ఏడాదికాలంగా పిల్లల చదువులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మానసికంగా కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాను.
-తిరునగరి రవీందర్, శ్రీరామ్ నగర్ కాలనీ
బ్యాంకు రుణాలకు బ్రేక్
30 ఏండ్ల క్రితం ప్లాట్ కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నా. అప్పటి నుంచి ఇదే ఇంట్లో కుటుంబంతో కలిసి జీవిస్తున్నా. గతంలో ఇదే భూమిపై బ్యాంకు రుణం కూడా తీసుకున్నా. ఆ లోన్ పూర్తయ్యే దశకు చేరింది. ఇప్పుడు పిల్లల పెండ్లిళ్ల కోసం మరోసారి బ్యాంకు రుణం తీసుకోవడానికి వెళితే, మీ భూమి 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్నదని, ప్రస్తుతం రుణం ఇవ్వలేమని బ్యాంకు అధికారులు స్పష్టంగా చెప్పారు. మా సొంత భూమి మాకు ఉపయోగపడని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా నిషేధిత భూముల సమస్యను తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. -లుకా శ్రీనివాస్, కొత్త యాస్వాడ
22-ఏ జాబితాతో సొంతింటి కలకు బ్రేక్
వేరే ప్రాంతంలో ఉన్న నా భూమిని అమ్మి రేకుర్తిలో రెండేండ్ల క్రితం భూమి కొనుగోలు చేసిన. భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని సొంతంగా ఇల్లు నిర్మించుకుందామని భావించా. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఇంటి నిర్మాణానికి అనుమతి కోరితే, గత 13 నెలలుగా రేకుర్తిలోని భూములు 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్నాయని, అనుమతులు ఇవ్వలేమని అధికారులు చెప్పారు. నా దగ్గర ఉన్న డబ్బంతా భూమి కొనుగోలుకే ఖర్చయిపోయింది. దీంతో సొంతింటి కల నెరవేర్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. భూమి కొనుగోలు చేసి రెండేండ్లు గడుస్తున్నా, 22-ఏ సమస్య కారణంగా నిర్మాణానికి అనుమతి రాకపోవడం బాధగా ఉన్నది. -ఆకుల కృష్ణ, రేకుర్తి