హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తేతెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజులు విస్తృతంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు.. ఉత్తర, ఈశాన్య తెలంగాణలో భారీ వర్షాలతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కాగా, ఆగస్టు చివరి వారం వచ్చినా రాష్ట్రంలోని సగం జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. ఆగస్టులో 21.58 సెం.మీ సగటు వర్షం కురువాల్సి ఉండగా, ఆదివారం వరకు 10.21 సెం.మీ మాత్రమే కురిసింది. శని, ఆదివారాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.