బీబీనగర్ , అక్టోబర్ 01 : క్రీడల్లోనూ తమ ప్రతిభను చాటుతూ మహాత్మా జ్యోతిబాపూలే సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. హనుమకొండలో సెప్టెంబర్ 26, 27 తేదీల్లో నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అండర్ 18, అండర్ 20 బాలికల విభాగాల పోటీల్లో కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. పోటీల్లో కళాశాలకు చెందిన 9 మంది విద్యార్థినులు రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా, ముగ్గురు పతకాలు సాధించారు. ఎంఎస్డీఎస్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని యోషిత 3,000 మీటర్ల స్టీపుల్ చేజ్ లో బంగారు పతకం సాధించింది. బీకాం తృతీయ సంవత్సరం విద్యార్థిని జి.చైతన్య 3,000 మీటర్ల స్టీపుల్ చేజ్ లో రజత పతకం, బీకాం ప్రథమ సంవత్సరం విద్యార్థిని నవ్య 800 మీటర్ల స్టీపుల్ చేజ్ లో కాంస్య పతకం సాధించింది. విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడంపై కళాశాల ప్రిన్సిపాల్ వేల్చూరి రాధ, అధ్యాపక బృందం, వ్యాయామ అధ్యాపకురాలు ఎ.బేబీ, డా.పి.అనిత హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినులను క్రీడల్లో ప్రోత్సహిస్తున్న అధ్యాపక బృందాన్ని అభినందిస్తూ, పతకాలు సాధించిన విద్యార్థినులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.