హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దూరదృష్టి, వ్యూహాత్మక ప్రణాళికలతో ఇక్కడ మౌలిక వసతులు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఎల్బీనగర్, సాగర్ రింగ్‌రోడ్డు, బైరామాల్‌గూడ ప్రాంతాల్లో ఏండ్ల తరబడి వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎస్ఆర్డీపీ కింద వందల కోట్లు వెచ్చింది అక్కడ ైఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణమైన ఫ్లైఓవర్లతో ఆయా జంక్షన్లన్నీ సిగ్నల్ ఫ్రీగా మారాయి. దీంతో అక్కడ వాహనదారుల ప్రయాణం సుగమమైంది. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చిన్నచిన్న పనులను కూడా పూర్తి చేయలేక చేతులెత్తేస్తోంది. కాంగ్రెస్ మార్క్ పర్యవేక్షణ రాహిత్యం, అధికారుల తీవ్ర అలసత్వంతో నేడు నగరంలో అస్తవ్యస్తంగా ట్రాఫిక్ వ్యవస్థ మారింది. ఇది నగర ప్రజల పాలిట శాపంగా మారిందింటూ.. వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగర్ చౌరస్తా సమీపంలో నెలకొన్న ప్రస్తుత దుస్థితికి అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపమే కారణమంటూ ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమంటూ వాహనదారులు మండిపడుతున్నారు.
సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): సాగర్ చౌరస్తాలో నిర్మించిన ైప్లెవోర్లతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించిందని స్థానికులు మురిసిపోయారు. అయితే ఆ చౌరస్తాలో తరుచూ ఏదో ఒక పని జరుగుతుండడం, నిత్యం వాహనదారులు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొక తప్పడం లేదు. బీఎన్‌రెడ్డి నుంచి సాగర్ చౌరస్తా వైపు వచ్చే వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆలయం సమీపం నుంచి చేపట్టిన పైపులైన్ పనులు నెలల తరబడి నత్తనడకన సాగుతున్నాయి. ఇక్కడ పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా, పనులు త్వరగా పూర్తి చేయాలనే ఆలోచన సంబంధిత శాఖ అధికారులు చేయకపోవడంతో అది వాహనదారులకు శాపంగా మారింది. ప్రధాన రోడ్లు, ప్రధాన జంక్షన్లలో ఏదైనా పనులు ప్రారంభించారంటే అక్కడ యుద్ధ్దప్రతిపాదికన పనులు పూర్తి చేస్తుంటారు. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా రోడ్డును మూసేసి పనులు నత్తనడకన నడుస్తున్నాయి. దీంతో ఆ రూట్లో వెళ్లే వాహనదారులు ప్రతి రోజూ గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సి వస్తున్నది. ట్రాఫిక్ రద్దీ నుంచి బయటపడేందుకు కాలనీల్లో నుంచి వెళ్లేందుకు వాహనదారులు ప్రయత్నిస్తున్నారు. దీంతో కాలనీలోని రహదారులు సైతం ట్రాఫిక్‌తో నిండిపోతున్నాయి.
సైన్ బోర్డులు లేక ఇబ్బందులు..!
కొన్ని రోజులు అక్కడ పైపులైన్ పనుల నిర్మాణం జరుగుతుంది. తరుచూ ట్రాఫిక్ పోలీసులు అక్కడ ట్రాఫిక్‌ను మళ్లించడం చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. అయితే ట్రాఫిక్ రద్దీలో చిక్కుకోకుండా ఉండేందుకు ముందస్తుగానే వాహనదారులకు అక్కడక్కడ ప్రత్యామ్నాయ రూట్లపై అవగాహన కల్పించేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, కనీసం ఇలాంటి పనులు కూడా చేయడం లేదంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షాకాలం కావడంతో రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. గతంలో ఉన్న చిన్న చిన్న గుంతలను పూడ్చకపోవడంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అవి పెద్దవిగా మారి వాహనదారులకు ఇబ్బందులు కల్గిస్తున్నాయి. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించే అధికారులు మొద్దు నిద్రలో ఉండడం, క్షేత్ర స్థాయిలో ఉండే అధికారులు సైతం అదే విధంగా ముందుకెళ్తుండడంతో అది సామాన్యులకు ఇబ్బందులను సృష్టిస్తోంది.
సమన్వయం లేకే ఇబ్బందులు
ైప్లెఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ తిప్పలు పూర్తిగా తప్పాయని భావించిన ప్రజలకు నేడు కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ విభాగాలు, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో తాము నరకం అనుభవిస్తున్నామంటూ వాహనదారులు వాపోతున్నారు. ఇక ఎల్బీనగర్ చౌరస్తాలోనూ రోడ్డు పరిస్థితులు బాగోలేక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ సాఫీగా వెళ్లాల్సిన ట్రాఫిక్‌కు సైతం ఎన్నో ఇబ్బందు
లు ఎదురవుతున్నాయి. సమస్య ఏంటీ…? అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే విషయాలపై ఉన్నతాధికారులు కనీస సమీక్షలు కూడా చేయకపోవడంతో పరిస్థితులు రోజు రోజుకు ఇబ్బందిగా మారుతున్నాయంటూ వాహనదారులు ఆరోపిస్తున్నారు. గతంలో ఉన్న ఒక పోలీస్ కమిషనర్ ఇక్కడ ప్రత్యక్షంగా పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. అయితే పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతో అక్కడ పూర్తిస్థాయిలో సమస్యలు మారలేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి యుద్ధప్రాతిపాదికన చర్యలు తీసుకొని సాఫీగా వాహనాలు వెళ్లేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.