నల్లగొండ ప్రతినిధి, జనవరి28(నమస్తే తెలంగాణ)/నల్లగొండ, జనవరి 28 : పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ అని, ఆనాడు రాష్ట్ర రైతాంగానికి సాయుధ పోరాటంతో నింపిన నల్లగొండ నేడు మరోసారి రాష్ట్రంలో రైతులు కాంగ్రెస్ సర్కార్‌పై తిరుగబడేందుకు వేదిక కావాలని, అందుకే ఇక్కడి నుంచి రైతు పోరాటానికి బీఆర్ఎస్ నాంది పలికిందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బండెనకబండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల పోతవు కొడకో నైజాం సర్కారోడా అని ఆనాటి నియంతలను నిలదీసిన నల్లగొండ గడ్డకు కాంగ్రెస్ నేతలు, వాళ్ల పాపాలు కొత్త కావని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే నల్లగొండ జిల్లాలో తాగునీటికి ఇబ్బంది అయి పిల్లల బొక్కల్లో మూలుగ చచ్చిపోయినయని, ఇక్కడి బిడ్డలు జీవచ్ఛవాలుగా మారారని, రైతులు అవస్థలు పడ్డారని విమర్శించారు. మళ్లీ ఇప్పుడు ప్రజలను మోసం చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వస్తున్న కాంగ్రెస్ నేతలను నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నాట్ల కోసం కాకుండా ఓట్ల కోసమే రైతుబంధు వేస్తున్న రేవంత్‌రెడ్డి సర్కార్‌పై రైతులు తిరుగబడాలన్నారు. నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్లో మంగళవారం బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అధ్యక్షతన బీఆర్ఎస్ రైతు మహాధర్నా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై, అధికారంలోకి వచ్చాక చేస్తున్న మోసాలపై, రైతులకు పెడుతున్న కుచ్చుటోపీపై, నల్లగొండకు జరుగుతున్న అన్యాయంపై, కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిపై ఇలా అనేక విషయాలపై కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలకు సైతం ఖబడ్దార్ అని హెచ్చరికలు చేశారు.
కాంగ్రెస్ నేతలకు వణుకెందుకు?
నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్లో రైతు ధర్నా పెడుతామంటే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వణుకు వస్తుందని కేటీఆర్ అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి దమ్మూధైర్యం ఉంటే, ఇదే గడియారం సెంటర్‌కు వచ్చి తమ లాగే రైతులకు ఏం చేశారో చెప్పాలని సవాలు చేశారు. ఏడాది పాలనలో జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి పీకిందేమీ లేదన్నారు. రైతు ధర్నాకు ప్రభుత్వం భయపడి అడ్డుకోవాలని చూస్తే న్యాయస్థానం రైతుల పక్షాన నిలిచిందని తెలిపారు. కాంగ్రెస్ మంత్రుల ఆదేశాలతో అతి చేస్తున్న పోలీసులు, అధికారులు జాగ్రత్తగా ఉండాలని, ఏదీ మర్చిపోమని, ముమ్మాటికీ భవిష్యత్తు మళ్లీ గులాబీ జెండాదేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ నేతలు చెరుకు సుధాకర్, కంచర్ల కృష్ణారెడ్డి, గొంగిడి మహేందర్ రెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డి, క్యామ మల్లేశ్, ఎనుగుల రాకేశ్‌రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, ఒంటెద్దు నర్సింహా రెడ్డి, నిరంజన్ వలీ, చాడ కిషన్ రెడ్డి, చకిలం అనిల్ కుమార్, తండు సైదులు గౌడ్, పాల్వాయి స్రవంతి, అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి, రాంచందర్ నాయక్, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మేడె రాజీవ్ సాగర్, పల్లె రవికుమార్, రేగట్టె మల్లిఖార్జున్ రెడ్డి, కడారి అంజయ్య, మందడి సైదిరెడ్డి, బోనగిరి దేవేందర్, కరీంపాష, గుజ్జ యుగేంధర్‌రావు, పల్లా ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం
ఆది నుంచి తెలంగాణ అన్ని రంగాల్లో వివక్షకు గురైంది. దానిని రూపుమాపడానికి కేసీఆర్ నాడు ప్రభుత్వంలో ఉండి బయటకు వెళ్లి ఉద్యమ జెండా పట్టారు. ఆనాడు కేసీఆర్ వెంట అనేక మంది మేధావులు కలిసి రావడం వల్ల ఉద్యమం తీవ్రమైంది. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని నినదించి పోరాడి సాధించిన తెలంగాణలో మీరైతేనే రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ప్రజలు చెప్పడంతో పదేండ్లు సీఎంగా కేసీఆర్ ఉండి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. పదేండ్ల బంగారు తెలంగాణను ఏడాది కాలంలోనే రేవంత్ రెడ్డి సర్వనాశనం చేసినందునే ఇవ్వాల బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతుల పక్షాన రంగంలోకి దిగారు. కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాక వదిలేది లేదని ధర్నాకు సిద్ధపడితే చిల్లరగా సోయిలేని కోమటిరెడ్డి అనుమతి ఇవ్వకుండా నిలిపివేశారు. కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్న తర్వాత నిర్వహించిన ఈ ధర్నాకు వచ్చిన రైతులను చూస్తే రాష్ట్ర ప్రభుత్వంపై అన్నదాతల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైతున్నది. నల్లగొండలో రైతులు ఇచ్చిన స్ఫూర్తితోనే రాష్ట్రమంతా బీఆర్ఎస్ తిరిగి రైతుల పక్షాన కొట్లాడుతుంది. మహాధర్నాలో కదం తొక్కి ప్రభుత్వంపై తిరుగుబాటుకుకు సై అన్న నల్లగొండ రైతులు, పార్టీ నాయకులు, శ్రేణులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నల్లగొండ నుంచే కేటీఆర్ రైతుల పక్షాన జంగ్ సైరన్ ప్రకటించడం జిల్లా పార్టీకి గర్వకారణం.
– గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే
417 రోజుల కాంగ్రెస్ పాలనలో 417 రైతు ఆత్మహత్యలు
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 417 రోజులు అవుతుండగా రాష్ట్ర వ్యాప్తంగా 417 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సర్కార్ రైతు వ్యతిరేక విధానాల వల్ల రోజుకో రైతు బలవన్మరణానికి పాల్పడుతున్నాడు. కేసీఆర్ హయాంలో రైతులు వ్యవసాయాన్ని పండుగ చేసుకుంటే రేవంత్ పాలనలో పంటలు ఎండబెట్టే పరిస్థితి వచ్చింది. గతేడాది పంద్రాగస్టులోపు రైతు రుణమాఫీ చేస్తామని ఒట్లు వేసిన రేవంత్ రెడ్డి ఇప్పటి దాకా ఎందుకు పూర్తి చేయలేదు. లగచర్ల, రామన్న పేటలో రైతులు, ప్రజలకు కాంగ్రెస్ పెట్టిన బాధలను ఈ రాష్ట్రం మరువదు.
-గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే
కేసీఆర్‌తోనే నల్లగొండ అభివృద్ధి
తెలంగాణ ఉద్యమ సమయంలోనే కేసీఆర్ స్వయంగా కృష్ణానీళ్ల దోపిడీపై, ఫ్లోరైడ్ విషపు పీడపై పాటలు రాశాడని కేటీఆర్ గుర్తు చేశారు. ‘పక్కన కృష్ణమ్మ ఉన్నా.. ఫలితమేమీ లేకపాయె.. పాలమూరు, నల్లగొండ పంటలు ఎండిపాయె’, ‘చూడుచూడు నల్లగొండ… గుండెనిండా ఫ్లోరైడ్ బండ…’ అంటూ నల్లగొండ రైతులు, ప్రజల దుస్థితిపై కేసీఆర్ కలం స్పందించిందని చెప్పారు. అట్లాంటి నల్లగొండను కేసీఆర్ సీఎం అయ్యాక అగ్రగామిగా తీర్చిదిద్దారని తెలిపారు. దేశంలోనే వరి పంటలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిస్తే రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా అత్యధిక ధాన్యం పండించే జిల్లాగా మారిందన్నారు. సమైక్య పాలనలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని టెయిల్ఎండ్ భూములకు సాగునీరు పారిన దాఖలాలు లేవని విమర్శించారు. అట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ నల్లగొండ రైతుల చివరి ఎకరా వరకు నీళ్లిచ్చిన రైతు నాయకుడన్నారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయంలో అగ్రస్థానంతోపాటు మూడు మెడికల్ కాలేజీలు వచ్చాయని, యాదగిరి గుట్ట గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారని, దామరచర్లలో తెలంగాణలోనే పెద్దదైన విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారని కేటీఆర్ వివరించారు. ఇలా చెప్పుకుంటే నల్లగొండకు కేసీఆర్ ఎన్నో చేశారని, దమ్ముంటే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్లాక్‌టవర్ సెంటర్ లో తమ జగదీశన్న, కంచర్ల భూపాల్‌రెడ్డితో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. కాంగ్రెస్ పాలనను చూసిన రైతులు.. పాలిచ్చే ఆవును వదిలేసి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని బాధపడుతున్నారని చెప్పారు.
హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ను నిలదీయాలి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ఏడాదిగా అమలు చేయలేదు. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీసి తరిమికొట్టాలి. మాజీ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేసిన సంక్షేమ పథకాలు రేవంత్‌రెడ్డి తీసేసి పేదల పొట్ట కొట్టాడు.
-పైళ్ల శేఖర్ రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే
రేవంత్‌రెడ్డిది రాక్షస పాలన
రాష్ట్రంలో ప్రజా పాలన తెస్తామని అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నాడు. రాష్ట్రంలో ఇంకా కేసీఆర్‌నే
ప్రజలు ఇష్టపడుతున్నారు. పథకాలు పూర్తి స్థాయి లో అమలు చేయలేకపోతున్నామని.. రైతు భరోసా, రుణమాఫీ రైతులకు ఇవ్వలేకపోయామని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నాడంటే మీ పాలన ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.
-కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే
రైతులను ఫూల్స్ చేయడానికే మార్చి 31 గడువు
ఈ నెలలో 4 పథకాలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి మండలంలో ఒక్క గ్రామానికే పరిమితం చేశాడు. రైతు భరోసా వెంటనే వేస్తామని చెప్పి మార్చి 31 వరకు గడువు పెట్టాడు. ఆ రోజు వరకు కూడా అవుతుందనే గ్యారెంటీ లేదు. ఇదంతా రైతులు, ఇతర ఆశావహులను ఏప్రిల్ 1న ఫూల్స్ చేయటానికే. ఈ ఏడాది కాలంలో ప్రజా పాలన పంగనామాల పాలనగా మారింది. అలీబాబా నలుగురు అన్నదమ్ముల్లాగా సీఎం రేవంత్ కుటుంబ సభ్యులు రాష్ర్టాన్ని దోచుకుంటున్నారు.
-గాదరి కిశోర్ కుమార్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే
సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసమే ఏడాది ఓపిక పట్టాం
బీఆర్ఎస్ సర్కార్ పదేండ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆగిపోవద్దనే ఆలోచనతో ఓపిక పట్టాం. కానీ ఈ ఏడాది కాలంలో కేసీఆర్ పెట్టిన పథకాలకు రేవంత్ సర్కారు స్వస్తి పలికి రాష్టాన్ని అన్ని రంగాల్లో ఆగం చేస్తున్నది. పార్టీలు, కులాలు, మతాలు, బంధువుల మధ్య పంచాయితీలు పెట్టి రాక్షసానందం పొందుతున్నది. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నది. కాంగ్రెసోళ్లు దోచుకోవడం దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.
-కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్
అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసింది. బీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకనే అధికారమే లక్ష్యంగా దొంగ హామీలిచ్చింది. ఏడాదిగా అమలు చేయని పథకాలను స్థానిక ఎన్నికలు రాగానే గుర్తుకు వచ్చి దరఖాస్తులు పెట్టిస్తున్నారు. అవి దరఖాస్తులకే పరిమితం తప్ప అమలు అయ్యేది మాత్రం లేదు.
-నోముల భగత్ కుమార్, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే
రైతు డిక్లరేషన్ హామీలేమాయె
ఎన్నికల ముందు కాంగ్రెస్ వరంగల్‌లో పెట్టిన రైతు డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదు. కేసీఆర్ లక్ష రుణమాఫీ చేస్తే, కాంగ్రెస్ రెండు లక్షలు చేస్తుందని ప్రకటించి రైతులను మోసం చేశారు. వరితోపాటు అన్ని పంటలకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని చెప్పి దాన్ని సన్న ధాన్యానికే పరిమితం చేశారు. సన్నాలు పండించిన రైతులకు కూడా పూర్తి బోనస్ ఇవ్వలేదు.
-రమావత్ రవీంద్రకుమార్, బీఆర్ఎస్ నల్లగొండ
జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే
రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన
రాష్ట్రంలో ఏడాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ప్రజలను ఇబ్బంది పెడుతున్నది. ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి ఇప్పుడు ఆ పార్టీ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నరు. మన రాష్ట్రంలో 70 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడ్డ నేపథ్యంలో కేసీఆర్ ప్రధానంగా ఆ రంగాన్ని పండుగలా మార్చారు. కానీ కాంగ్రెస్ దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చి రైతు బంధు ఎగొట్టింది. రుణమాఫీ పూర్తి చేయలేదు.
-ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి చేతులెత్తేశారు..
రాష్ట్రంలో రెండు లక్షలకు మించిన రైతులతోపాటు పలు కారణాలతో రెండు లక్షలకు లోపు ఉన్న రైతులకు రుణమాఫీ కాలేదు. ఈ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలను కలిసి వివరిస్తే ఆయన ఇక చేయలేమని చేతులెత్తేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో రైతు బంధు వేసి ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ ఈ సారి పథకాలు అమలు చేయలేక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామంటేనే భయపడుతున్నది.
-నల్లమోతు భాస్కర్ రావు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే
కోమటిరెడ్డినే చెప్పుతో కొట్టాలి
రైతు భరోసా రాలేదు అన్న వాళ్లను చెప్పుతో కొట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్న మాటలను రైతులు మర్చిపోలేదు. మూడు సీజన్లుగా ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వని కోమటిరెడ్డినే రైతులు చెప్పుతో కొట్టాలి. పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడే కోమటిరెడ్డి, నిత్యం గాలి మోటార్లల్లో తిరిగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి రైతుల బాధలు ఏం తెలుస్తాయి. అక్రమాలు చేశారని కొందరు మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టి తర్వాత వారి నుంచి కోట్లు తీసుకొని మళ్లీ అనుమతి ఇచ్చిన సంగతి జిల్లా ప్రజలకు తెలుసు.
-బొల్లం మల్లయ్య యాదవ్, కోదాడ మాజీ ఎమ్మెల్యే