నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్20(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఈనెల 23న నల్లగొండకు రానున్నట్లు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయ ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు జరిగే నూతన పంచాయతీ పాలకవర్గాల సన్మానోత్సవ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను కేటీఆర్ సన్మానించనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ 250కి పైగా పంచాయతీలపై గులాబీ జెండా ఎగరేసింది. అధికార కాంగ్రెస్ నుంచి దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలను ఎదుర్కొంటూ బీఆర్ఎస్ శ్రేణలు బలంగా తలపడ్డాయి.
ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా…బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మార్గదర్శనంలో మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు అధికార కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, రేషన్‌కార్డులు కట్ చేస్తామని బెదిరించినా…ప్రజల మద్దతును కూడగట్టి గట్టి పోటీ ఇచ్చారు. కాంగ్రెస్ కంగుతినేలా బీఆర్ఎస్ ఫలితాలను సాధించింది. నల్లగొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం జరుగనున్న సన్మానోత్సవ కార్యక్రమం విజయవంతంపై పార్టీ నేతలు దృష్టి సారించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లను షురూ చేశారు.
శనివారం జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో స్థలాన్ని జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. మీటింగ్ స్థలం, వేదిక, వేర్వేరు గ్యాలరీలు, భోజనాలు, పార్కింగ్ తదితర అంశాలపై దృష్టి సారిస్తూ చర్చించారు. జిల్లాలో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులంతా హాజరయ్యేలా చూడాలని మాజీ ఎమ్మెల్యేలను కోరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, విద్యార్థి విభాగం నేత బొమ్మరబోయిన నాగార్జున తదితరులు పాల్గొన్నారు.