నందికొండ, జూలై 30 : కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ జల సవ్వడులతో తొణికిసలాడుతున్నది. శ్రీశైలం నుంచి సుమారు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జునసాగర్‌కు నీళ్లు వచ్చి చేరుతున్నాయని.
శ్రీశైలం ప్రాజెక్ట్ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకుగానూ ప్రస్తుతం 883.50 (207.41 టీఎంసీలు) అడుగులకు చేరుకోవడంతో వరద ఉధృతిని తగ్గించడానికి డ్యామ్ అధికారులు ఐదు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. క్రస్ట్ గేట్ల ద్వారా 1,35,935 క్యూసెక్కులు, జలవిద్యుత్ కేంద్రాల ద్వారా 60,999 క్యూసెక్కులు కలిపి 1,96,934 క్యూసెక్కులు నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వస్తున్నాయి.
ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండడంతో నాగార్జునసాగర్‌వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. త్వరలో సాగర్ జలాశయం నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకు గానూ ప్రస్తుతం 516.30 అడుగులు (142.61టీఎంసీలు) ఉన్నది.
డ్యామ్ కుడికాల్వ ద్వారా 6,877 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసి ద్వారా 800 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది. సాగర్‌కు వరద వచ్చి చేరుతుండడంతో ఆగస్టులో ఆయకట్టు సాగుకు నీటి విడుదల చేసే అవకాశం ఉన్నది. 2016లో సాగర్ నీటి మట్టం 514 అడుగుల వద్ద ఉన్నప్పుడు ఎడమ కాల్వకు ఆగస్టు 26న నీటి విడుదలను ప్రారంభించారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువగానే నీటి నిల్వలు ఉండడంతో ఆయకట్టు రైతులు ఆశాజనకంగా ఉన్నారు.