నీలగిరి, సెప్టెంబర్ 17 : నిజాం నిరంకుశ పాలనలో విసిగి వేసారిన తెలంగాణ ప్రజానీకం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యంలోకి అడుగు పెట్టేందుకు చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నల్లగొండ జిల్లా కీలక పాత్ర పోషించిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మంగళవారం స్థానిక పరేడ్ గ్రౌండ్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.
పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న ఇండియన్ యూనియన్‌లో విలీనమైన తెలంగాణ ఈ 77 ఏండ్లలో ఎంతో ప్రగతి సాధించిందన్నారు. ఎందరో త్యాగధనుల పోరాటంతో నేడు అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందుకు దూసుకు వెళ్తున్నదన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో, స్వాతంత్య్ర సంగ్రామంలో అమరులైన యోధులకు నివాళులర్పించారు. ఎందరో మహానుభావాలు ఈ గడ్డ మీద చేసిన అసమాన త్యాగాల ఫలితమే ఈనాటి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అని పేర్కొన్నారు. ఆ త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది అని తెలిపారు.
ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభల ద్వారా ఎంతోమంది పోరాటం చేయగా.. అందులో నల్లగొండ కమ్యూనిస్టులు కీలకంగా వ్యవహరించారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. రావి నారాయణరెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, జిట్టా రామచంద్రారెడ్డి, కట్కూరి రామచంద్రారెడ్డి, సుశీలాదేవి, సుద్దాల హనుమంతు, బొందుగుల నారాయణరెడ్డి, ఎర్రబోతు రాంరెడ్డి వంటి ఎందరో ముందుండి పోరాడారన్నారు.
దొడ్డి కొమురయ్య మరణంతో సాయుధ పోరాటం తీవ్రమైందని గుర్తుచేశారు. ఆనాటి పోరాటంలో చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి కీలక పాత్ర పోషించారన్నారు. నల్లగొండ జిల్లా నుంచి బండి యాదగిరి రాసిన బండెనక బండి కట్టి పాట, వెట్టి చాకిరీని వ్యతిరేకిస్తూ సుద్దాల హనుమంతు రాసిన పాలబుగ్గల జీతగాడా పాటరాచరిక ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి ప్రజల్లో చైతన్యం రగిలించాయని తెలిపారు. గుండ్రాంపల్లి, కడివెండి, రావులపెంట, ఏనెమీదిగూడెం ప్రాంతాలు ఉద్యమానికి కేంద్ర బిందువులుగా నిలిచాయన్నారు.
తొలిదశ ఉద్యమంలో పెద్దమనుషుల ఒప్పందం అమలు కాకపోవడంతో దానికి వ్యతిరేకంగా విద్యార్థులు, మేధావులు ఉద్యమించి దాదాపు 300 మంది అమరులయ్యారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, జలగం వెంగళ్రావు, టీఎన్ సదాలక్ష్మి, మదన్మెహన్, మర్రిచెన్నారెడ్డి తదితరులు ముందుడి తొలిదశ ఉద్యమాన్ని నడిపించారన్నారు. అప్పట్లో అవకాశాలను అందరికీ సమానంగా అందించాలనే ఉద్దేశంతో ఇందిరాగాందీ ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థ తెలంగాణ ప్రజల అకాంక్షను తీర్చలేక అన్యాయాలను ఆపలేకపోవడంతో 2011 నుంచి మలిదశ ఉద్యమం తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి పేరుతో ప్రారంభమైందని తెలిపారు.
జిల్లాకు చెందిన కాసోజు శ్రీకాంతాచారితోపాటు ఎందరో యువకులు ప్రాణం త్యాగం చేశారని గుర్తుచేశారు. ఓవైపు మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగర హారం వంటి మహత్తర ఉద్యమాలు నడుస్తుంటే, మరోవైపు పార్లమెంట్లో ఎంపీలు తమ గళాన్ని బలంగా వినిపించారన్నారు. తెలంగాణ బిడ్డల త్యాగాలను, పోరాటాలను చూసి చలించిన సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్ర సాధనలో అమరుల త్యాగం వెలకట్టలేనిదన్నారు.
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పలు ఆటంకాలు ఏర్పడడంతో వాటిగా ఇన్చార్జిగా ఉన్న డీఈఓపై ఆదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం సాంస్కృతిక కార్యక్రమాలకు విద్యార్థులు హాజరుకాకపోవడం, మెక్సెట్ పని చేయకపోవడం, పాటలు పూర్తిస్థాయిలో రికార్డింగ్ చేయకపోవడంతో సీరియస్ అయ్యారు.
సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా ముందుకు సాగుతుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఇటీవలే తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరును కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి, హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్త ఉద్యోగ కల్పన కోసం జాబ్ క్యాలండర్‌ను ప్రకటించినట్లు తెలిపారు. రాష్ట్ర మహిళలందరికీ మహాలక్ష్మి పధకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, రూ.10లక్షలకు ఆరోగ్య శ్రీ పెంపు వంటి అమలుచేస్తున్నట్లు తెలిపారు.
గృహజ్యోతి పధకం కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నట్లు చెప్పారు. నల్లగొండ జిల్లాలో 1.73 లక్షల రైతుకు కుటుంబాలకు రూ.1,433 కోట్లు మాఫీ చేశామన్నారు. నల్లగొండ జిల్లా రైతాంగానికి మరింత అండగా ఉంటానన్నారు. బహుజన ప్రజారాజ్య స్ధాపకుడు సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సమీకృత గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీశైలం సొరంగమార్గం, బ్రాహ్మణ వెల్లంల లిఫ్ట్‌తో జిల్లాను సస్యశ్యామలం చేస్తానన్నారు.
రూ.275 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, రూ.20 కోట్లతో నర్సింగ్ కళాశాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రూ.512.81 కోట్లతో నల్లగొండ జిల్లాలో 241.90 కిలోమీటర్లు మేర రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. విజయవాడ-హైదరాబాద్ జాతీ య రహదారిని త్వరలోనే ఆరు లైన్లకు విస్తరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ శరత్చంద్ర పవార్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, నేనావత్ బాలూనాయక్, ఆదనపు కలెక్టర్లు శ్రీనివాస్, పూర్ణచంద్ర, ఏఎస్పీ రాములు నాయక్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.