చండూరు జూలై 26 : మండలాల ఏర్పాటు సమయంలో మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది గట్టుప్పల్ మండలాన్నేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆ ప్రతిపాదనను చివరి నిమిషంలో నిలువరించింది స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అని మండిపడ్డారు. వాయిలపల్లి గామస్తులతో అప్పటి జిల్లా కలెక్టర్‌కు పిటిషన్ ఇప్పించి అడ్డుకున్నదే ఆయనని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన గట్టుప్పల్ మండల కేంద్రంలో స్థానికులు మంగళవారం సాయంత్రం ముఖ్యమంతి కేసీఆర్‌కు కృతజ్ఞత సభ ఏర్పాటుచేశారు. మండల ఏర్పాటుకు కృషి చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి ప్రసంగిస్తూ.. కొత్త జిల్లాల ప్రతిపాదన తెరమీదకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి ‘సూర్యాపేట జిల్లా ఏర్పాటు అవుతుంది.. శుభాకాంక్షలు’ అని చెప్పిన మరుక్షణమే అప్పటి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి తానే స్వయంగా ఫోన్ చేసి గట్టుప్పల్ మండల ప్రతిపాదనను ప్రస్తావించినట్లు చెప్పారు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చివరి నిమిషంలో ఇక్కడి వారితో అప్పటి కలెక్టర్‌కు పిటిషన్ ఇప్పించడంతో ఆగిపోయిందన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆగిపోయిన ప్రతిపాదనను ప్రజల డిమాండ్ అంటూ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రభాకర్‌రెడ్డి ప్రస్తావించడం, తాను ముఖ్యమంతి కేసీఆర్ దృష్టికి తీసుకుపోవడంతో గట్టుప్పల్ మండల కేంద్రంగా ఏర్పాటు అయిందన్నారు. సరిగ్గా నెల కితం కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసేందుకు గట్టుప్పల్‌కు వచ్చిన సమయంలోనే ఇక్కడి ప్రజల ఆకాంక్ష అయిన గట్టుప్పల్ మండల ఏర్పాటు త్వరలోనే నెరవేరుతుందని చెప్పినట్టే, సీఎం కేసీఆర్ సహకారంతో ఏర్పాటు చేశామన్నారు. అందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడంపై నిర్వాహకులను మంత్రి అభినందించారు. నమ్ముకున్న పార్టీని, ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలను వంచనకు గురి చేయాలనుకుంటున్న నీకు బీజేపీలో ఎందుకు చేరాలనుకుంటున్నావో సంజాయిషీ ఇచ్చే దమ్ము, ధైర్యం ఉందా అని ఎమెల్యే రాజగోపాల్‌రెడ్డిని ప్రశ్నించారు. గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినందుకా బీజేపీలో చేరేది అంటూ నిలదీశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ 2లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తున్నందుకా? అని ప్రశ్నించారు. విదేశాల నుంచి నల్ల డబ్బును తెచ్చి దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాలో వేస్తానన్న రూ.15లక్షలు వేయనందుకా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కర్నాటి వేంకటేశం, ఇడెం కైలాసం పాల్గొన్నారు
సిఎం కేసీఆర్‌కు జైకొట్టిన గట్టుప్పల్
చండూరు, జూలై 26 : రాష్ట్ర ప్రభుత్వం గట్టుప్పల్‌ను మండల కేంద్రంగా ప్రకటించడంతో గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత సభ సక్సెస్ అయ్యింది. సభకు పలు గ్రామాల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు, జనం ర్యాలీలతో భారీగా తరలివచ్చారు. డప్పు చప్పుళ్లు, కోలాటాలు, ధూంధాం కార్యక్రమాలతో ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. మండలంగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జైకొట్టారు. సభకు హాజరైన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లు, మహిళల కోలాటాలతో మంత్రి సభాస్థలికి చేరుకున్నారు. మార్గమధ్యలో టీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాలుస్తూ, గులాబీ పూలు చల్లుతూ జై తెలంగాణ నినాదాలు చేశారు. ధూంధాం కార్యక్రమంతో సభా స్థలి దద్దరిల్లింది. కార్యక్రమంలో జడ్పీటీసీలు కర్నాటి వెంకటేశం, పాశం సురేందర్‌రెడ్డి, నారబోయిన స్వరూపారవికుమార్, మున్సిపల్ చైర్మన్లు తోకల చంద్రకళావెంకన్న, వెన్‌రెడ్డి రాజు, ఎంపీపీలు పల్లె కళ్యాణీరవికుమార్, ఏడుదొడ్ల శ్వేతారవీందర్రెడ్డి, మెండు మోహన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు గుర్రం మాధవీవెంకట్రెడ్డి, దంటు జగదీశ్వర్, గట్టుప్పల్ మండల సాధన కమిటీ కన్వీనర్ ఇడెం కైలాసం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, డీసీసీబీ డైరెక్టర్ కోడి సుష్మావెంకన్న, సర్పంచులు ఇడెం రోజా, వీరమళ్ల శ్రీశైలం, పంకెర్ల పద్మ, అబ్బనబోయిన లింగయ్యయాదవ్, చొప్పరి అనూరాధ, ఎంపీటీసీలు అవ్వారు గీతాశ్రీనివాస్, చెరుపల్లి భాస్కర్, నాయకులు నామని జగన్నాథం, నామని గోపాల్, పోరెడ్డి ముత్తిరెడ్డి, కర్నాటి అబ్బయ్య, దోర్నాల అమరేందర్, ఇడెం గణేశ్ పాల్గొన్నారు.
మునుగోడు నియోజకవర్గానికి రాజగోపాల్‌రెడ్డి చేసింది శూన్యం
గట్టుప్పల్ మండలం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో రాలేదు. రాష్ట్రంలో పాలనా పరంగా అవసరమైన చోట మండలాలు ఇచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధిలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పాత్ర శూన్యం. ఎంపీగా, ఎమ్మెల్సీగా చేసింది కూడా ఏమీ లేదు. అప్పుడేం చెయ్యలేనోడు ఎమ్మెల్యేగా ఇప్పుడేం చేస్తాడు. ఆయన రాజీనామా చేసినా.. చేయకపోయినా ఈ ప్రాంత అభివృద్ధి టీఆర్ఎస్తోనే జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని గ్రామాలను తిరిగి అభివృద్ధి చేశా. నెలకో, ఆరు నెలలకోసారి వచ్చే రాజగోపాల్‌రెడ్డి.. ఆయన తిరిగే రోడ్లు ఎవరు వేశారో చెప్పాలి. మన ఎమ్మెల్యే రాజగోపాల్ కాదు.. మెంటల్ గోపాల్ అని నామకరణం చేస్తున్నా. మంత్రి బాధ్యతలు, ఎమ్మెల్యే బాధ్యతలకు తేడా తెల్వని రాజగోపాల్ డబ్బు సంచులతో రాజకీయం చేస్తున్నాడు. ఆయనకు కల్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చే తీరిక లేకపోతే మేము ఇస్తుంటే ఓర్వలేక అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. గట్టుప్పల్ మండలం చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. నేను మాజీ అయినా సరే.. తాజాగానే మీకు సేవకుడిగా అందుబాటులో ఉంటా. మునుగోడు ప్రజల రుణం తీర్చుకుంటా.