కోదాడ, ఆగస్టు 14 : బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కోదాడ నియోజకవర్గంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా కోదాడ పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. కోదాడ, అనంతగిరి, చిలుకూరు మండలాల్లోని వాగులు పొంగిపొర్లుతుండగా ఇప్పటికే వేసిన నార్లు నీట మునిగాయి. జిల్లా అధికారులు సూర్యాపేట, నల్లగొండ జిల్లాలను రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్పితే ప్రయాణాలు చేయవద్దని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి సూచించారు. ఇక కోదాడ పట్టణంలో కురిసిన కుంభవృష్టికి లోతట్టు ప్రాంతాలలో ఉన్న శిరిడి సాయినగర్, తులసి టౌన్షిప్ వంటి పలు కాలనీలు జలమయమయ్యాయి.
ఇక తమ్మర బండపాలెం వాగు బ్రిడ్జికి సమాంతరంగా పొంగిపొర్లుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. మున్సిపల్ అధికారులు బుధవారం రాత్రి అప్రమత్తమై శిరిడి సాయినగర్, తులసి టౌన్షిప్లోని పలువురిని ప్రోక్లైన్లతో మైదాన ప్రాంతానికి తరలించారు. పునరావాసం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులను ఇళ్లకు పంపించారు. కోదాడ పెద్ద చెరువు పొంగుతుండడంతో అనంతగిరి – కోదాడ రహదారిలో వరద ఉధృతికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
kodada : వాయుగుండంతో వణుకుతున్న కోదాడ
హుజూర్నగర్ వెళ్లే రహదారిలో బ్రిడ్జి పొంగిపొర్లుతుండడంతో శ్రీమన్నారాయణ కాలనీవాసులు తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. కోదాడ మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో అంతరంగా వాగు పొంగిపొర్లుతూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కోదాడ డివిజన్లో ఎడతెరిపిలేని వర్షంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, అధికారులను అప్రమత్తం చేసినట్లు ఆర్డీఓ సూర్యనారాయణ తెలిపారు.
kodada : వాయుగుండంతో వణుకుతున్న కోదాడ