– చర్చ అంతా 22వ గ్రూప్ అంశంపైనే
– ముడుపులు తీసుకొని నియమించారని బీ ఆర్ఎస్ కౌన్సిలర్ల మండిపాటు
– అధికారుల నిర్లక్ష్యంపై అసహనం
కోదాడ, జూన్ 12 : కోదాడ మున్సిపాలిటీ సాధారణ సమావేశం శుక్రవారం వాడివేడిగా జరిగినట్లు సమాచారం. కోదాడ పట్టణ పరిధిలో పలు అంశాలపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు మామిడి రామారావు, చీమ నరేశ్, కందుల చంద్రశేఖర్ తోపాటు ఇండిపెండెంట్ కౌన్సిలర్ డాక్టర్ నాగేశ్వరరావు మరో ఇరువురు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు కమిషనర్, అధికారులను నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యంపై పలువురు కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మున్సిపల్ ప్రత్యేక అధికారి పాలన హయాంలో అధికారులు భారీగా అవినీతికి పాల్పడి నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు దండుకుని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను 22వ గ్రూపుగా ఏర్పాటు చేసిన అంశంపై దాదాపు రెండున్నర గంటల పాటు కమిషనర్, కౌన్సిలర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఏడుగురు ఉద్యోగులను నియమించారని ఇప్పుడు సదరు గ్రూపులో మృతి చెందిన వారసులను కాక ఇతర వ్యక్తులను ఎలా నియమించారని మండిపడ్డారు.
సదరు గ్రూపునకు జీతాలు నిలిపివేయాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు పలువురు అధికార పార్టీ కౌన్సిలర్ కూడా డిమాండ్ చేయడంతో ఆ గ్రూపును పక్కకు పెట్టినట్టు తెలిసింది. గతంలో 26 మందిని, 70 మందిని నియమించి జీతాలు ఇవ్వకుండా పక్కకు పెట్టారని అప్పుడు లేని మానవతా దృక్పథం ఇప్పుడు ఎందుకు చూపాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రశ్నించినట్లుగా సమాచారం. అదేవిధంగా పార్క్ అభివృద్ధి పనులకు, సిగ్నల్ వ్యవస్థకు వెచ్చించిన వ్యయంపై కూడా చర్చ జరిగింది. మున్సిపాలిటీ పరిధిలో ఎస్ సి ఎస్ టి వార్డులకు సంబంధించి వార్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సమాచారాన్ని తమకు అందించడం లేదని ఆ వార్డుల కమిషనర్లు సమావేశం అనంతరం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మునిసిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్మన్ మల్లీశ్వరి, కమిషనర్ రమాదేవి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.