– స్వచ్ఛందంగా పాల్గొన్న వ్యాపార, విద్యా సంస్థలు
– మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నేతృత్వంలో నిరసన ర్యాలీ
కోదాడ, ఆగస్టు 31 : బాధితులపై పట్టణ సీఐ దాష్టీకానికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నేతృత్వంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కోదాడ పట్టణ బంద్ సోమవారం విజయవంతం అయింది. మున్సిపల్ అధికారులు అక్రమంగా ముందస్తు సమాచారం లేకుండా తమ డబ్బా కొట్టును తొలగించినందుకు నిరసనగా యజమానురాలు గంధం కనకమ్మ, ఆమె కుమార్తెలు, తమ్ముడు మాదల ఉపేందర్ గడిచిన శనివారం ప్రధాన రహదారిపై నిరసన చేస్తున్న క్రమంలో పట్టణ సీఐ శివ శంకర్ నాయక్ విచక్షణ రహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆయన తీరుకు నిరసనగా నిర్వహిస్తున్న బంద్కు పట్టణంలోని వర్తక వ్యాపార దుకాణదారులు, విద్య సంస్థలు మూసివేశారు. అశోక్ నగర్ లోని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నివాసం నుండి వందలాదిమంది బీఆర్ఎస్ శ్రేణులు నల్లజెండాలు, గులాబీ జెండాలతో నిర్వహించిన బైక్ ర్యాలీ ప్రధాన రహదారి నుండి శ్రీరంగాపురం మీదుగా ఖమ్మం క్రాస్ రోడ్డు నుండి బస్టాండ్ మీదుగా, పోలీస్ స్టేషన్ దాటి, రంగా థియేటర్ చౌరస్తా చేరుకుంది.

కోదాడ బంద్ విజయవంతం
అక్కడినుండి హుజూర్నగర్ ప్రధాన రహదారి మీదుగా వెళ్లి తిరిగి హైదరాబాద్ ప్రధాన రహదారి గుండా తిరిగి ఖమ్మం క్రాస్ రోడ్డు వరకు చేరుకుంది. శాంతియుతంగా స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే బైక్ ర్యాలీపై అభివాదం చేశారు. కాగా సామాన్యులపై, బాధితులపై దాడి చేసిన పట్టణ సీఐని తొలగించాలంటూ బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలతో ప్రధాన రహదారులపై దిక్కులు పిక్కటిల్లాయి. బంద్ విజయవంతం చేసిన వర్తక, వ్యాపార, వాణిజ్య విద్యాసంస్థల బాధ్యులకు, పట్టణ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే బొల్లం ధన్యవాదాలు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల, పట్టణ నాయకులు బట్టు శివాజీ, జానకి, రామాచారి, శ్రీనివాస్, నాగయ్య, పాషా, టి.రమేష్, కోలా ఉపేందర్, రామయ్య, ప్రదీప్, నర్సిరెడ్డి, దేవబత్తిన సురేశ్, ఆంజనేయులు, మహేశ్ గౌడ్, భూపాల్ రెడ్డి, పొట్ట కిరణ్ కుమార్, శీలం సైదులు, నయీమ్, చీమ నరేశ్, ఉపేందర్ గౌడ్, భాగ్యమ్మ, కరీముల్లా, కాసాని మల్లయ్య గౌడ్, మధుసూదన్ రెడ్డి, దేవల నాయక్ బాబు, జానీ పాషా పాల్గొన్నారు.

కోదాడ బంద్ విజయవంతం