మామిళ్లగూడెం, జనవరి 17 : ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరుగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం వైరా హైవేలో రాకపోకలు సాగించే సాధారణ వాహనాలను ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ దారి మళ్లించనున్నారు. సభ నేపథ్యంలో ఐదు రోజులుగా ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనర్లు ఏవీ రంగనాథ్, విష్ణు ఎస్. వారియర్లు సమాలోచనలు చేశారు. సభ జరిగే ప్రాంతాలు, ట్రాఫిక్ ఏరియాలు, దారి మళ్లింపులకు తీసుకోవాల్సిన జాగ్రతలపై కసరత్తు చేసి రూట్ మ్యాప్‌ను విడుదల చేశారు. రాష్ట్రంలోని 31 జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్నాటక, ఢిల్లీ, పంజాబ్, యూపీ రాష్ర్టాల నుంచి ప్రజలు, ప్రతినిధులు హాజరు కానున్న నేపథ్యంలో అధికారులు ఆ మేరకు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 18న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో దేశ ప్రజలకు దిశా నిర్దేశం చేయనున్నారు. దీంతో 18 ఖమ్మం మీదుగా వచ్చిపోయే సాధారణ, భారీ వాహనాల ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆ రోజున ఖమ్మం మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటున్నందున ప్రజలు అత్యవసరమైతేనే ఆ రోజు ప్రయాణాలు పెట్టుకోవాలని పోలీసులు సూచించారు. లేదంటే పోలీసు శాఖ నిర్దేశించిన రూట్లలోనే ప్రయాణించాలన్నారు.
సూర్యాపేట రూరల్, జనవరి 17 : నేడు ఖమ్మం జిల్లాలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్లే వాహనాలకు ఇబ్బంది లేకుండా సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం ఆయన సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామ స్టేజీ నుంచి 365వ జాతీయ రహదారిని పరిశీలించారు. సభకు ఇతర జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యే క్రమంలో రహదారులపై భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు ఫోన్ చేసి పోలీసు సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఆయన వెంట డీఎస్పీ నాగభూషణం, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐలు సాయిరాం, విష్ణు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.