– మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం
గట్టుప్పల్, మార్చి 17 : నూతనంగా ఏర్పడిన గట్టుప్పల్ మండల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చర్యలు శూన్యమని మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం అన్నారు. గట్టుప్పల్ గ్రామంలో ఇరుకైన రోడ్లతో రెండు వాహనాలు ఒకదానికొకటి ఎదురైతే సజావుగా వెళ్లే పరిస్థితి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మండల అభివృద్ధికి నిధులు కేటాయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రెండు పర్యాయాలు గ్రామంలో రోడ్డు వైడనింగ్ చేయుటకు సంబందిత అధికారులు సర్వే చేసి రూ.5 కోట్ల వ్యయంతో డబుల్ రోడ్డు (సి.సి) నిర్మాణం, రూ.3 కోట్ల వ్యయంతో సైడ్ డ్రెయిన్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఈఎన్సీ వద్ద పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గట్టుప్పల్ వాయిళ్లపల్లి బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.3.50 కోట్లతో మంజూరైన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేశారని, వాటిని మంజూరు చేసి పనులు ప్రారంభించాలన్నారు.
గట్టుప్పల్, పుట్టపాక రోడ్డు మండల కేంద్రం నుండి చౌటుప్పల్, హైదరాబాద్ వెళ్లుటకు ప్రధాన రహదారి. పంచాయతీరాజ్ రోడ్డును ఆర్ అండ్ బీ కి మార్చి డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. బంగారిగడ్డ, తేరట్పల్లి వరకు డబుల్ రోడ్డు సిఆర్ఎఫ్ నిధులతో రూ.30 కోట్లు మంజూరై నిర్మాణం పనులు జరుగుతున్నాయి, గట్టుప్పల్ మండల కేంద్రం వరకు రోడ్డు పూర్తి చేయుటకు ఇంకా సుమారు అదనంగా రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయాలన్నారు. అలాగే గత ప్రభుత్వంలో గట్టుప్పల్ గ్రామానికి రెండు చేనేత క్లస్టర్లు మంజూరయ్యాయి, లబ్ధిదారులకు 500 స్టాండ్ మగ్గాలు పంపిణీ చేశారు. పథకానికి సంబందించిన లబ్ధిదారు కంట్రిబ్యూషన్ 10 శాతం డబ్బులు చేనేత శాఖ అధికారులకు చెల్లించియున్న చేనేత కార్మికులకు ఇంకా అందాల్సిన 110 స్టాండ్ మగ్గాలు, 100 చిటికి ఆసు యంత్రాలు, నూలు తిప్పే డబ్బా మిషన్లు వెంటనే రిలీజ్ చేయాలన్నారు. అలాగే మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల గత ప్రభుత్వంలో మనఊరు-మనబడి పథకంలో రూ.54.90 లక్షల నిధులతో నూతన భవన నిర్మాణం, డైనింగ్ హాలు రూ.14.60 లక్షల నిధులతో మంజూరైన పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లకు చేసిన పనులకు బిల్లులు రాని కారణంగా నేటికి అసంపూర్తిగా ఉన్నవి. ఉపాధ్యాయులు గడిచిన 3 సంవత్సరాలు నుండి ఆరుబయటే తరగతులు నిర్వహిస్తూ కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. నూతన గట్టుప్పల మండల కేంద్రంలో అద్దె భవనాలలో కొనసాగుచున్న ఎమ్మార్వో, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్ ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వెంటనే శాశ్వత భవనాలు నిర్మించాలన్నారు. శాశ్వత భవనాలపై ఇటీవలే ప్రభుత్వం జీఓ విడుదల చేసిందని చెప్పారు. మండల అభివృద్ధికై ఎమ్మెల్యేతో పాటు స్థానిక నాయకులు చొరవ తీసుకుని అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేయించాలన్నారు. అలాగే చేనేతలకు రావలసిన మాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికలలో పబ్బం గడుపుకోవడానికి చేనేతల ఓట్లను ఆకర్షించుకోవడానికి మున్సిపల్ కేంద్రాల్లో మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా రూ.17 కోట్ల నిధులు విడుదల చేసి ఇతర ప్రాంతాల చేనేతలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చిలుకూరి అంజయ్య, పున్న కిశోర్, కర్నాటి వెంకటేశం, బావండ్ల శ్రీనివాస్, పున్న ఆనంద్, నారని జగన్, జూలూరు పురుషోత్తం, నేలంటి వెంకటేశం, చెరిపల్లి నాగేశ్, ఖమ్మం రాజశేఖర్, పెదగాని నాగరాజు పాల్గొన్నారు.