నల్లగొండ ప్రతినిధి, జనవరి14 (నమస్తే తెలంగాణ) :ప్రస్తుతం రాజకీయంగా ఏ నోట విన్నా ఈ నెల 18వ తేదీన నిర్వహించే ఖమ్మం సభపైనే చర్చ సాగుతున్నది. బీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం జరుగుతున్న తొలి బహిరంగ సభ కావడంతో అందరి దృష్టి దీనిపైనే కేంద్రీకృతమైంది. అధినేత కేసీఆర్‌తోపాటు ముగ్గురు సీఎంలు, పలువురు మాజీ సీఎంలు పాల్గొంటుండడంతో దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానానికి దారితెన్నులు చూపే సభగా దీన్ని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సభకు భారీగా తరలివెళ్లేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కూడా పార్టీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. ఖమ్మం ఆనుకుని ఉండే సూర్యాపేట జిల్లా నుంచి భారీ జన సమీకరణకు ప్లాన్ చేశారు. ఇక నల్లగొండ, యాదాద్రి జిల్లాల నుంచి పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నేతలు, అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు ఎవరికి వారు తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఖమ్మం సభలో ఉమ్మడి జిల్లా భాగస్వామ్యంపై మంత్రి జగదీశ్‌రెడ్డి పార్టీ నేతలు, ముఖ్యులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఉద్యమ రోజుల నుంచి అప్పటి టీఆర్ఎస్కు అండగా నిలిచిన జిల్లా ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ సక్సెస్‌లోనూ అగ్రభాగాన నిలువాలని పిలుపు నిచ్చారు. సభ విజయవంతానికి నియోజకవర్గాల వారీగా పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నేతలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఖమ్మంలో ఈ నెల 18వ తేదీన తలపెట్టిన బీఆర్ఎస్ తొలి బహిరంగసభకు జిల్లా నుంచి పెద్దసంఖ్యలో తరలివెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సరిహద్దుగా ఉన్న సూర్యాపేట జిల్లా నుంచి భారీ సమీకరణపై దృష్టి సారించారు. ఈ జిల్లా పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం సభ జనసమీకరణ, ఏర్పాట్ల విషయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టి సారించారు. జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, ఇతర ముఖ్య నేతలందరితో మంత్రి ఇప్పటికే చర్చించి జన సమీకరణపై దిశానిర్దేశం చేశారు. సూర్యాపేటతోపాటు తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల నుంచి 1.20లక్షల మంది ఖమ్మం సభకు తరలివెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 30వేల మందికి తగ్గకుండా సభకు వచ్చేలా చూడాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే నియోజవర్గ స్థాయి సమావేశాలు సైతం ఏర్పాటు చేశారు.
శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఖమ్మం సభలో సూర్యాపేట నియోజకవర్గ ప్రాతినిధ్యం భారీగా ఉండాలని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. దేశంలో మోదీ సర్కార్ విధానాలతో విసిగిపోయిన ప్రజలు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఖమ్మం బహిరంగసభకు తరలివచ్చేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నారని చెప్పారు. సభకు వచ్చే వారికి తగిన రవాణా ఏర్పాట్లపై తక్షణమే దృష్టి సారించి వాహనాలు సమకూర్చుకోవాలని సూచించారు. ఇక ఇదే రోజు సాయంత్రం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనూ సన్నాహక సమావేశం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌తో కలిసి జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ఇందులో పాల్గొన్నారు.
ప్రతి గ్రామంతో పాటు పట్టణాల్లోని వార్డు నుంచి ప్రజలు సభకు వచ్చేలా చూడాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఈ సభను జాతీయ రాజకీయాలకు మేలిమలుపుగా భావిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా ప్రతిష్టాత్మంగా తీసుకొని పనిచేయాలని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ స్పష్టం చేశారు. సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో వెంటనే జనసమీకరణ, అందుకు తగిన ఏర్పాట్లపై దృష్టి సారించాలని సూచించారు. ఇక శనివారం పండుగ రోజు సైతం తుంగతుర్తి నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ పాల్గొని పార్టీ శ్రేణులకు బహిరంగసభ ప్రాధాన్యతను వివరించారు. ఈ సభకు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చేలా పార్టీ నేతలంతా బాధ్యత తీసుకోవాలని సూచించారు. అట్టడుగు వర్గాల వరకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్‌దేనని, అలాంటి కేసీఆర్ వెంటే ప్రజలు ఉన్నారని, వారిని బీఆర్ఎస్ సభలో భాగస్వాములుగా చేయాలని చెప్పారు. ఇక ఆదివారం హుజూర్నగర్ నియోజకవర్గ సన్నాహక సమావేశం కూడా జరుగనుంది. ప్రధానంగా ఈ నాలుగు నియోజకవర్గాల నుంచి లక్షలాదిగా తరలివెళ్లేలా పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ శ్రేణులు
ఇక నల్లగొండ, యాదాద్రి జిల్లాల నుంచి కూడా ఖమ్మం సభకు తరలివెళ్లేలా ఎక్కడికక్కడే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నేతలతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులంతా సభకు హాజరుకానున్నారు. వీరంతా ఎవరికీ వారే మండలాల వారీగా చర్చించుకుని స్వచ్ఛందంగా సభకు వెళ్లేందుకు ఏర్పాట్లపై దృష్టి సారించారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న తొలి బహిరంగసభ కావడంతో అందరికీ దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అధినేత కేసీఆర్‌తోపాటు ముగ్గురు సీఎంలు, పలువురు మాజీ సీఎంలు, పలు రాష్ట్రాల నుంచి ప్రముఖులు సభకు హాజరవుతుండడంతో సభ ద్వారా ఏం చెప్పనున్నారన్న ఉత్కంఠత నెలకొంది. ఇక సీపీఎం, సీపీఐ నేతలు కూడా సభలో పాల్గొంటుండడంతో వామపక్ష శ్రేణులు సైతం ఖమ్మం సభపై ఆసక్తితో ఉన్నాయి. దాంతో బీఆర్ఎస్తోపాటు ఇతర వర్గాల నుంచి కూడా సభకు తరలివెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేశానికి మేలిమలుపు సభ
కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న ఖమ్మం సభ దేశ రాజకీయాలకు మేలి మలుపులాంటిది. ఈ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో స్థానిక ఎమ్మెల్యేల పర్యవేక్షణలో సూర్యాపేట జిల్లా నుంచే 1.20లక్షల మందికి పైగా జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నాం. పార్టీ ముఖ్యులతో సన్నాహక సమావేశాలు కూడా పూర్తి చేశాం. ఇక మిగిలిన ఉమ్మడి జిల్లా నుంచి పార్టీలోని అన్ని స్థాయిల నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సభకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ అడుగులో అడుగేసి నడిచేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు ఎల్లప్పుడూ సిద్ధమని ఈ సభ ద్వారా మరోసారి నిరూపితం కానున్నది.
– బడుగుల లింగయ్యయాదవ్, ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు