యాదగిరిగుట్ట, జూన్ 1 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని ప్రపంచమే అబ్బురపడేలా తీర్చిదిద్దిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. చుట్టుపక్కల ప్రకృతి సంపదను అదేరీతిలో మహాద్భుతం గా రూపొందించారు. ఆయన కలల రూపమే రాయగిరి చెరువుపై కొలువుదీరిన ‘మినీ శిల్పారామం.’ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వైటీడీఏ నిధు లు రూ.5 కోట్లతో రెండెకరాల్లో కొలువుదీరిన శిల్పారామం.. సోమవారం నుంచి లక్ష్మీనృసింహుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు చేరువకానున్నది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం సాయం త్రం 4:30 గంటలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లేదారిలో రాయగిరి గ్రామంలో పెద్దచెరువు ఉన్నది. ఇది ఒకప్పుడు కేవలం నీటి నిల్వకు మాత్రమే ఉపయోగపడేది. కానీ, ఇప్పుడు దానిని తొలి సీఎం కేసీఆర్ ఒక అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి సులభంగా చేరేందుకు రహదారి విస్తరణతోపాటు పక్కనే అభయారణ్యాలు నిర్మించారు. వీటికి నృసింహ, ఆంజనేయ అభయారణ్యాలుగా నామకరణం చేశారు. 140 ఎకరాల్లో విస్తరించిన ఆంజనేయ అరణ్యంలో 60 వేల మొక్కలు, 240 ఎకరాల్లో విస్తరించిన నృసింహ అరణ్యంలో 30 వేల మొక్కలు నాటగా.. నేడు అవి ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.150 కోట్లు ఖర్చు చేసి రాయగిరి నుంచి ఆలయం వరకు 6 కిలోమీటర్ల మేర నాలుగులైన్ల రహదారి నిర్మించారు. చెరువులో నాలుగుచోట్ల వాటర్ ఫౌంటెయిన్లు ఏర్పాటు చేశారు. చెరువులో షికారు చేసేందుకు చక్కని బోటింగ్ వ్యవస్థను సిద్ధం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన లైటింగ్ రాత్రిపూట భక్తులకు మిరుమిట్లు గొలిపేలా ఉన్నది.
రాయగిరి చెరువు అలుగుపోసే ప్రాంతంలో శిల్పారామాన్ని అద్భుతంగా నిర్మించారు. శిల్పారామంలోకి ప్రవేశించే మార్గంలో స్వాగతతోరణం అబ్బురపరుస్తున్నది. పిల్లలు ఆడుకునేందుకు, పెద్దలు సేద తీరేందుకు మైదానాన్ని సిద్ధం చేశారు. ఫుడ్‌కోర్టు ఏర్పాటు చేశారు. చెరువు మధ్యలో ఐలాండ్, పక్కనే వంతెన వంటి నిర్మాణాలకు సన్నాహాలు చేస్తున్నారు. చిన్న, చిన్న కుటీరాల మధ్యలో పిల్లలు ఆడుకునేందుకు, పెద్దలు సేదతీరేందుకు మైదానాన్ని సిద్ధం చేశారు. మధ్యలో ఖాళీ ప్రదేశాల్లో తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే రూపంలో వివిధ ప్రతిమలు తీర్చిదిద్దారు.