అమ్మకు ఆసరాగా, బిడ్డకు ఆప్యాయతతో ప్రోత్సాహకాలు అందించేందుకు తీసుకొచ్చిన ఎంసీహెచ్ కిట్ (కేసీఆర్ కిట్) నిలిచిపోయింది. సర్కారు దవాఖానల్లో ప్రసవాలు ప్రోత్సహించి తల్లీబిడ్డలు ఆరోగ్యంగా చూడడానికి చేయూతనిచ్చే పథకం ఆగింది. ప్రసవ సమయంలో ఆసరాగా నిలుస్తుందనుకున్న నగదు అందని ద్రాక్షలా మారింది. జిల్లాలో మూడు నెలలుగా పథకం సక్రమంగా అమలు కావడం లేదు. దాంతో కిట్లను బయట ప్రైవేట్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 జూన్‌లో కేసీఆర్ కిట్ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రసవం తర్వాత తల్లీబిడ్డకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పించడం, వారు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బిడ్డలకు జన్మనిచ్చిన మహిళలు ఈ పథకానికి అర్హులు. ఇద్దరికి కంటే ఎక్కువ పిల్లలుంటే దీనికి అనర్హులుగా నిర్ణయించింది. కేసీఆర్ కిట్‌లో తల్లీబిడ్డలకు అవసరమయ్యే సుమారు రూ. 15వేల విలువైన వస్తువులు అందిస్తున్నారు. ఇందులో సబ్సులు, బేబీ ఆయిల్, బేబీ బెడ్, దోమల తెర, డ్రెస్సులు, చీరలు, హ్యాండ్ బ్యాగ్, టవల్, న్యాప్కిన్లు, పౌడర్, డైపర్స్, షాంపు, పిల్లల బొమ్మలు తదితర ఐటెమ్స్ ఉంటాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కిట్ అనే పేరును తొలగించి, ఎంసీహెచ్ (మదర్ అండ్ చైల్డ్ హెల్త్) కిట్‌గా నామకరణం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం కిట్‌తోపాటు ఆర్థిక సాయం కూడా అందిస్తున్నది. ఆడబిడ్డ పుడితే రూ. 13వేలు, మగబిడ్డ పుడితే రూ. 12వేల చొప్పున సాయం చేస్తున్నది. గర్భం దాల్చినప్పటి నుంచి తొమ్మిదో నెల వరకు నాలుగు దశల్లో ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. 5-6 నెలల మధ్య పరీక్షల కోసం ప్రభుత్వ దవాఖానకు వచ్చినప్పుడు రూ. 3వేలు, ప్రసవ సమయంలో బాబు జన్మిస్తే రూ. 2వేలు, పాప పుడితే రూ. 5వేలు ఇస్తారు. శిశువుకు మూడున్నర నెలల్లో టీకాలు వేస్తే రూ.2 వేలు, 9నెలల సమయంలో టీకాలు వస్తే రూ. 3వేలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. కానీ కొంత కాలంగా డబ్బులు జమ కావడంలేదు. నిధులు లేమీ కారణంగా అందడంలేదు. జిల్లాలో సుమారు రూ.12.14కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ పథకంతో మాతా శిశు సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. పథకం వచ్చిన తర్వాత సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. మాతాశిశు మరణాల సంఖ్య కూడా తగ్గింది. అంతే కాకుండా ప్రైవేట్ ఖర్చు భారం కూడా తగ్గుతున్నది. ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటళ్లకు పోతే అడ్డగోలు బిల్లులు వసూలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కిట్లు ఎప్పటికప్పుడు పంపిణీ చేసేవారు. ప్రసవం తర్వాత ఎప్పటికప్పుడు ఠంఛనుగా ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఈ పథకానికి మంచి గుర్తింపు లభించింది. కానీ ప్రస్తుతం కిట్ల కొరత వేధిస్తున్నది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కిట్లు అందుబాటులో లేవు. గర్భిణుల నమోదు పెరుగుతున్నా మూడు నెలలుగా కిట్లు అందడంలేదు. ప్రభుత్వం నుంచి సరఫరా కావడంలేదని అధికారులు చెబుతున్నారు. సుమారు 300మందికి కిట్లు అందించాల్సి ఉంది. ప్రసవం అయిన వెంటనే కిట్లు ఇవ్వకపోవడంతో బాలింతలు, శిశువుల కోసం బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సంవత్సరం క్రితం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అయిన రోజే బిడ్డ రక్షణ కోసం కేసీఆర్ కిట్టు అడుగక ముందే ఆసుపత్రి వాళ్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు అప్పటిలాగా లేదు. ఇప్పుడు ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో నా కూతురు కాన్పు అయ్యి మూడు రోజులు అవుతున్నది. ఇంకా కిట్ ఇవ్వడం లేదు. మేమే మందుల షాపులో కొనుకొచ్చుకున్నాం. అప్పుడు బిడ్డ పుట్టిన రోజే అవసరమైన అన్నీ కిట్టులో పెట్టి ఇచ్చేవారు. అప్పుడు చాలా బాగుండే. ఇప్పుడు ఏమీ లేవు. ఇస్తరో లేదో కూడా తెల్వదు.
– సికినంమెట్ల లక్ష్మమ్మ, చౌటుప్పల్³