హాలియా, డిసెంబర్ 17 : దేశంలో ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధ్వానంగా మారిన ప్రభుత్వ విద్యా సంస్థల పరిస్థితిపై మంగళవారం శాసన మండలిలో ఆయన మాట్లారు. సర్కారు అసమర్థత వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రోజురోజుకూ మూతపడుతున్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, హాజరు శాతం గణనీయంగా పడిపోతున్నదని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన చదువు, భోజనం అందించిందని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రాథమిక స్థాయి నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశ పెట్టిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని కోరారు.