కోదాడటౌన్, ఫిబ్రవరి 19: ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింల పక్షపాతి అని, ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. పట్టణంలోని సాలార్జంగ్పేటలో రూ. 20 లక్షలతో చేపట్టిన ఈద్గా ఆధునీకరణ పనులకు ఆదివారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మాట్లాడారు. మైనార్టీల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. విద్యా పరంగా మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలలను స్థాపించి నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు చెప్పారు. పేద ముస్లిం యువతుల వివాహనికి షాదీముబారక్ పథకంతో రూ. 1,00, 116 అందిస్తున్నారని అన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు సబ్సిడీ రుణాలందిస్తున్నదన్నారు. చారిత్రక మసీదులు శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రభు త్వం లక్షలాది రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నదన్నారు. ఈద్గాలను ముస్లింల పవిత్ర స్థలాలుగా గుర్తించి వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. మౌజన్లు, ఇమాంలకు ప్రభుత్వం ప్రతినెలా గౌరవ వేతనాలు ఇస్తున్నదన్నారు.
రంజాన్ పండుగకు కానుకలు, ఇఫ్తార్ విందులు ఇచ్చి పేద ముస్లింలంతా పండుగ చేసుకునే విధంగా కృషి చేస్తున్నదన్నారు. అనంతరం ఎమ్మెల్యేను ముస్లిం లు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పెద్ద మసీదు గురువు అబ్దుల్ ఖాదర్, సదర్ మహ్మద్, అహ్మద్, మాజీ కోఆఫ్షన్ సభ్యుడు ఆల్తాఫ్ హుస్సేన్, మసీదు కమిటీ అధ్యక్షుడు మహ్మద్, మాజీ కౌన్సిలర్ నయీం, మైనార్టీ నాయకులు బాషుమియా, మౌలానా, మదార్, షఫీ, ఖదిర్పాషా, ఖాజామొహీనుద్దీన్, కందుల చంద్రశేఖర్, గ్రంథాలయ చైర్మన్ రహీం, శ్రావణ్, శ్రీను పాల్గొన్నారు.