యాదాద్రి భువనగిరి, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ రజతోత్సవ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్‌లో నిర్వహించనున్న సభకు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలిలి రావాలని సూచించారు. రజతోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సన్నాహక సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి శుక్రవారం ఎర్రవెల్లిలోని వారి నివాసంలో కలిశారు.
ఈ సందర్భంగా రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ, వరంగల్ బహిరంగ సభ తదితర అంశాలపై పార్టీ అధినేత నాలుగు నియోజకవర్గాల నాయకులకు దిశా నిర్దేశం చేశారు. త్వరలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిగతా ఎనిమిది నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సమావేశం ఉంటుందని తెలిపినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నట్లు జిల్లా నేతలు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు.