కట్టంగూర్, సెప్టెంబర్ 30 : కట్టంగూర్ మండలం నారెగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నల్లకుంటబోళ్లు గ్రామానికి చెందిన రావుల జనార్దన్ రెడ్డి నాలుగు ప్రభుత్వ కొలువులు సాధించి ఆదర్శంగా నిలిచాడు. టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్-2 ఫలితాల్లో మున్సిపల్ కమిషనర్గా ఎంపికయ్యాడు. జనార్దన్ రెడ్డి మొదట 2019లో పంచాయతీ కార్యదర్శిగా, 2025లో గ్రూప్-4లో ఎంపికై నల్లగొండలో కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం జూనియర్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అంతటితో ఆగకుంగా 2025లో గ్రూప్-3లో 108 ర్యాంక్ పొందగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కాలేదు. 2025లో గ్రూప్-2 పరీక్ష రాసి 78వ ర్యాంక్ పొంది మున్సిపల్ కమిషనర్గా ఎంపికయ్యాడు. ఇతనిది వ్యవసాయ కుటుంబం. జనార్ధన్ రెడ్డికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
ఇదే మండలంలోని మునుకుంట్ల గ్రామ పంచాయతీ పరిధి అక్కలాయిగూడెంకు చెందిన వెల్మకంటి వేణు గ్రూప్-2 ఫలితాల్లో జనరల్ అడ్మిసిస్ట్రేషన్ (జీడీఏ)లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఎంపికయ్యాడు. వేణు ప్రస్తుతం చండూరు మండలంలో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. వేణు 2019లో తొలి ప్రయత్నంలోనే పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించాడు. అయినా పట్టువీడక పోటీ పరీక్షలకు సిద్ధమై గ్రూప్-2 ఫలితాల్లో 231 ర్యాంక్ సాధించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా ఎంపికయ్యాడు. ఇతనిది వ్యవసాయ కుటుంబం. తల్లి జయమ్మ అనారోగ్యంతో మృతి చెందింది.
Kattangur : మున్సిపల్ కమిషనర్, ఏఎస్ఓగా కట్టంగూర్ మండల వాసుల ఎంపిక