బోనకల్లు, ఆగస్టు 15: వరద నీటితో మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం (KGBV) తలపిస్తున్నది. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తుఫాన్ కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వానలతో ప్రభుత్వం స్కూల్కు సెలవు ప్రకటించింది. కానీ వర్షపు నీరు మాత్రం కస్తూర్భా గాంధీ విద్యాలయంలో నిలిచిపోయింది. నీరు వెళ్లడానికి ఎలాంటి అవకాశం లేకపోవడంతో విద్యాలయ ఆవరణంలోనే నిలిచిపోయి చెరువును తలపిస్తున్నది. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన చేతిపంపు కూడా వరద నీటిలో మునిగిపోయింది.
నిలిచిన నీటితో విద్యార్థులు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా నీరు నిలిచిపోవడంతో దుర్వాసన వస్తుందని, దోమలకు నిలయంగా మారడంతో అనారోగ్యానికి కారణమవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి వర్షపు నీటిని తొలగించాలని వేడుకుంటున్నారు. కస్తూర్బా గాంధీ విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ సక్కుబాయి మాట్లాడుతూ.. కురిసిన వర్షానికి విద్యాలయంలో నీరు నిలిచిపోయింది. అదూ ఎటూ పోవడానికి అవకాశం లేకుండా పోయింది. నీటిని తొలగించేందుకు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.