యాదగిరిగుట్ట, జనవరి 22 : అభం శుభం తెలియని కన్న కుమారులు, కూతురిని తాళ్లతో కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి వదిలించుకోవాలని చూసింది ఓ కర్కశ తల్లి. ఈ ఘటన ఈ నెల 14న యాదగిరిగుట్ట పట్టణంలో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ చంద్రశేఖర్, ట్రాఫిక్ సీఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా సరూరునగర్లోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన బాబురావు, లక్ష్మి 12 ఏండ్ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అక్కడే కాపురం పెట్టారు. ఈ జంటకు లక్ష్మణ్(8), రాజేశ్వరి(7), రేవంత్(5)అనే ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. బాబురావు, లక్ష్మిలది ఆది నుంచీ కలహాల కాపురమే. మూడెండ్ల క్రితం బాబురావు ఇంట్లో చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. తర్వాత లక్ష్మి అదే ప్రాంతానికి చెందిన ఓ ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకొని ఇటీవలే అతడిని పెళ్లి చేసుకుంది. తమ కాపురానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని, వారిని వదిలించుకోవాలని లక్ష్మి, ఆటో డ్రైవర్ అయిన ఆమె భర్త అనుకున్నారు.
ముగ్గురు పిల్లలతో కలిసి ఆటోలో ఈ నెల 14న అర్ధరాత్రి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. అప్పటికే వెంట తెచ్చుకున్న తాళ్లతో కొండకింద కల్యాణకట్ట వద్ద పిల్లల కాళ్లు, చేతులు కట్టేసి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. అనంతరం చిన్నారులను వదిలేసి పరార య్యారు. కాసేపటికి(8)ఏండ్ల బాలుడు కట్లను వదిలించుకొని చెల్లి, తమ్ముడి కట్లు విప్పి వారి నోట్లో నుంచి గుడ్డలను తొలగించాడు. అక్కడే ముగ్గురు చలిలో వణుకుతూ.. తెల్లవారేదాక గడిపారు.
సంక్రాంతి రోజు దైవదర్శనానికి వచ్చిన భక్తులను యాచించి ఆకలి తీర్చుకున్నారు. పిల్లలను ట్రాఫిక్ కానిస్టేబుల్ కోటి చూసి యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఎస్ఐ సుధాకర్‌రావు జిల్లా బాలల పరిరక్షణ అధికారి సైదులుకు సమాచారం ఇచ్చారు. ముగ్గురు పిల్లలను అప్పగించారు. వారు భువనగిరిలోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. 17న బాలల పరిరక్షణ విభాగం అధికారులు ఆ పిల్లలను విచారించగా, పెద్దబాబు వాళ్ల పెదనాన్న సెల్‌ఫోన్ నంబర్‌ను అధికారులకు చెప్పాడు. అధికారులు అతడిని భువనగిరి రప్పించి విచారించారు. బాబురావు తన తమ్ముడు అని అంగీకరించాడు. చిన్నతనం నుంచే తమతో దూరంగా ఉంటున్నారని, అతడి పిల్లలతో తమకు సంబంధం లేదని చెప్పి వెళ్లాడు. అనంతరం అధికారులు పిల్లల వాంగ్మూలాన్ని నమోదు చేసుకొని 20న జిల్లా బాలల పరిరక్షణ సమితి (సీడబ్ల్యూసీ) ఎదుట ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి పిల్లలను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.