ములుగు, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ) : మూడు దశాబ్దాల పోరుబాటకు సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్ స్వస్తిపలికారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు నిర్ణయించుకొని మంగళవారం హైదరాబాద్‌లో డీజీపీ ఎదుట లొంగిపోయారు. నిషేధిత మావోయిస్టు పార్టీలో 28 సంవత్సరాలుగా అజ్ఞాతంలో పని చేసిన బడే చొక్కారావుది ములుగు జిల్లా సమ్మక్క-సారక్క తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామం. ఇదే గ్రామానికి చెందిన బడే ఎల్లయ్య-బతుకమ్మల కుమారుడైన దామోదర్‌కు సోదరుడితో పాటు ఇద్దరు అక్కా చెల్లెల్లు ఉన్నారు. ఇతను తాడ్వాయి మండలం బయ్యక్కపేట గ్రామంలో ప్రాథమిక విద్యభ్యసించారు.
ములుగు మండలం రాయినిగూడెం ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివి గోవిందరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. 1996లో 10వ తరగతి చదువుతున్న సమయంలోనే దామోదర్ రాడికల్ స్టూడెంట్ యూనియన్(ఆర్ఎస్యూ)లో చేశారు. 1998 డిసెంబర్ మాసంలో ఆయన సమీప బంధువు అయిన బడే నాగేశ్వర్రావు అలియాస్ ప్రభాకర్ ప్రోద్బలంతో దామోదర్ సీపీఐ(ఎంఎల్) పీపుల్స్ వార్‌లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు.
తొలుత ఏటూరునాగారం, మహేదేవ్‌పూర్ ప్రాంత మహిళా దళంలో పార్టీ సభ్యుడిగా పనిచేశారు. 1999లో కొత్తగూడెం-పాల్వంచ ఏరియా కమిటీకి బదిలీ చేయగా దళ కమాండర్ దిలీప్ న్యాయకత్వంతో పార్టీ సభ్యుడిగా పనిచేశారు. 2000లో ఏటూరునాగారం దళంలో డిప్యూటీ కమాండర్‌గా పదోన్నతి పొందారు. 2001లో కొత్తగూడెం-పాల్వంచ ఏరియా కమిటీకి కమాండర్ హోదాలో పదోన్నతి లభించింది. 2003లో అక్కడి నుంచి దామోదర్‌ను బదిలీ చేసి మేడారం ఎల్వోఎస్కు ఇన్చార్జిగా నియమించారు. 2005లో ఏరియా కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొంది ఏటూరునాగారం మహదేవ్పూర్ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు.
2006లో ఖమ్మం, కరీంనగర్, వరంగల్(కేకేడబ్ల్యూ) డివిజనల్ కమిటీ సభ్యుడిగా(డీసీఎంగా) పదోన్నతి పొందారు. 2007లో జరిగిన ఎన్కౌంటర్లో డీసీఎం మధు మృతి చెందగా ఆయన స్థానంలో ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా దామోదర్ నియమితులయ్యారు. 2009లో డివిజనల్ కమిటీ కార్యదర్శి(డీసీఎస్)గా పదోన్నతి పొంది కేకేడబ్ల్యూ పరిధిలో కరీంనగర్ ఈస్ట్, వెస్ట్ డివిజన్లకు ఇన్చార్జిగా పనిచేశారు. 2015లో తెలంగాణ రాష్ట్ర కమిటీ(టీఎస్ఈ)లో స్టేట్ కమిటీ సభ్యుడిగా(ఎస్ఈఎం) పదోన్నతి పొంది కేకేడబ్ల్యూ డివిజనల్ కమిటీకి ఇన్చార్జిగా పనిచేశారు. 2019 మార్చిలో దామోదర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ(టీఎస్ఈ) సైనిక వ్యవహారాల ఇన్చార్జిగా పనిచేశారు.
2025 జనవరిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ(టీఎస్సీ) కార్యదర్శిగా పదోన్నతి పొంది అప్పటి నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2001లో దామోదర్ ఏటూరునాగారం దళంలో పార్టీ సభ్యురాలిగా పనిచేసిన ఏటూరునాగారం మండలం గోగుపల్లి గ్రామానికి చెందిన ఎట్టి నర్సమ్మ అలియాస్ సబితను వివాహం చేసుకున్నాడు. ఆమె 2012 ఏప్రిల్‌లో చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పువ్వర్తి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. అనంతరం 2016లో చెర్ల ఎల్వోఎస్ పార్టీ సభ్యురాలిగా పనిచేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం మల్కపల్లి గ్రామానికి చెందిన మడకం కోసి అలియాస్ రజితను వివాహం చేసుకున్నాడు.
2022లో పోలీసులు రజితను అరెస్టు చేయగా ప్రస్తుతం ఆమె జైలులో ఉన్నారు. మావోయిస్టుల లొంగుబాటు కోసం ములుగు జిల్లా పోలీసులు వినూత్నంగా ‘పోరు కన్న ఊరు మిన్న’ అనే కార్యక్రమాన్ని చేపట్టి పార్టీలో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులను పలు మార్లు కలిసి పోలీసులకు లొంగిపోవాలని కోరారు. పలు మార్లు దామోదర్ సొంత గ్రామమైన కాల్వపల్లిలో ములుగు పోలీస్ ఉన్నతాధికారులు దామోదర్ తల్లి బతుకమ్మను కలిసి ఆమె యోగక్షేమాలను తెలుసుకున్నారు.
దామోదర్ జనజీవన స్రవంతిలో కలిసేందుకు అవగాహన కల్పించారు. 2025 జనవరి 16న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో దామోదర్ మృతి చెందినట్లు వదంతులు వచ్చాయి. ఈ విషయంపై పోలీసులు అధికార ప్రకటన చేయకపోవడంతో దామోదర్ మృతి చెందలేదని నిర్ధారణ అయింది. పోలీసులకు, మావోయిస్టులకు పలు మార్లు జరిగిన ఎదురు కాల్పుల్లో దామోదర్ రెప్ప పాటులో తప్పించుకొని ప్రస్తుతం డీజీపీ ఎదుట లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిశారు.