నల్లగొండ, సెప్టెంబర్ 12 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కన్నెకంటి రంగయ్య (108) శుక్రవారం స్వర్గస్తులయ్యారు. ఆయన మృతికి సిపిఐ ఎం నల్లగొండ జిల్లా కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, డబ్బికారి మల్లేశం, నారి ఐలయ్య, వి.వెంకటేశ్వర్లు, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, కందాల ప్రమీల, సయ్యద్ హాశం, చినపాక లక్ష్మీనారాయణ తెలిపారు. రంగయ్యకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మిర్యాలగూడ మండలంలోని యాద్గారిపల్లి గ్రామానికి చెందిన కన్నెకంటి రంగయ్య సర్పంచ్ వ్యవస్థ ఏర్పడగానే మొదటిసారి యాద్గారిపల్లి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మండల వ్యవస్థ ఏర్పడగానే మొదటిసారిగా మిర్యాలగూడ మండల పరిషత్ ఎంపీపీగా పనిచేశారు. సింగిల్ విండో వైస్ చైర్మన్‌గా పని చేసినట్లు తెలిపారు.
నాటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దళ కమాండర్‌గా గా పనిచేసి ఎన్నో పోరాటాలు సాగించారని, ఆరు సంవత్సరాల పాటు మహారాష్ట్ర ఔరంగాబాద్ జైల్లో గడిపినట్లు వెల్లడించారు. ముసీరాబాద్ జైల్లో 2 సంవత్సరాలు కారాగార జీవితాన్ని గడిపారన్నారు. 4 ఏళ్లు అజ్ఞాతంలో ఉండి నాటి సాయుధ పోరాటాన్ని నడిపించినట్లు వివరించారు. నిజాం నవాబులకు వ్యతిరేకంగా బలమైన పోరాటాలు చేసినట్లు, యాద్గారిపల్లి, కాల్వపల్లి, ఉట్లపల్లి, తక్కెలపాడు, తడకమల్ల గ్రామాల్లో పార్టీ నిర్మాణం కోసం విశేష కృషి చేసినట్లు కొనియాడారు. ఆయన అంత్యక్రియలు శనివారం మిర్యాలగూడ మండలం యాద్గారిపల్లిలో జరుగనున్నట్లు పేర్కొన్నారు.