నల్లగొండ, జూన్ 27 : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు నల్లగొండ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి కంచర్ల భూపాల్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లేఖ సారంశం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు నల్లగొండకు రావడం ఆహ్వానించతగ్గ పరిణామమే. అయితే సీఎం తమ ప్రాంతానికి వస్తున్నారంటే సహజంగానే ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రజల్లో ఆకాంక్షలు, ఆశలు, కోరికలు ఉంటాయి. మీ రెండున్నర ఏండ్ల పాలన కాలంలో ఇది రెండోసారి మీరు నల్లగొండ పర్యటనకు రావడం. కానీ నేటికీ ఈ నల్లగొండ నియోజకవర్గ ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నవి అక్కడే ఉన్నాయి. ఇక్కడి నుండి ప్రాతినిద్యం వహిస్తున్న రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాల్లో తిరుగుతూ నల్లగొండ ప్రజలను గాలికి వదిలేశారు. నల్లగొండ నియోజకవర్గంలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్ల అభివృద్ధి పనులను మంజూరు చేశారు. ఇందులో కొన్ని పూర్తి కాగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. అయితే ఇవన్నీ నల్లగొండ ప్రజల అవసరాలకు అనుగుణమైన పనులు కావడంతో పాటు నల్లగొండ రూపు రేఖలు మార్చే పథకాలు.
కానీ రెండున్నర ఏండ్ల కాలంలో ఇక్కడి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వీటి వైపు కన్నెత్తి చూడడం లేదు. నల్లగొండ క్లాక్ టవర్ నడిబొడ్డున ఆర్అండ్ బీ అతిధి గృహం కోసం నిర్మించిన అత్యాధునిక భవనాన్ని మాత్రం తన నివాసంగా మార్చుకుని మిగతా పథకాలను అటకెక్కించారు. ఆయన నివాసమైన ఇందిరా భవన్ నుండి ఎదురుగా కనిపిస్తున్న నల్లగొండ కళాభవన్ నిర్మాణం కోసం తట్టేడు మట్టి కూడా తీయలేదు. ఇక క్లాక్ టవర్ నుండి రామగిరి, రైల్వే ఫ్లైఓవర్ రోడ్డు అద్వానంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం కమీషన్లు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇస్తూ నిజమైన ప్రజల అవసరాలను గాలికి వదిలేశారు. నిత్యం పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ నల్లగొండ ప్రజల సమస్యలను పక్కదారి పట్టిస్తూ మోసం చేస్తున్నారు. నేటికీ ఎస్ఎల్బీసీ సొరంగమార్గం, ఉదయసముద్రం ప్రాజెక్టు లాంటి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరు నల్లగొండకు వస్తున్న సందర్భంగా ఇక్కడి మంత్రి వ్యవహారశైలి, ప్రజల సమస్యలు, పెండింగ్ పనులు, తదితరు అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అందులో కొన్ని ప్రధాన అంశాలు.
– తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండను దత్తత తీసుకుని రూ.1,500 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించారు
– మా హయాంలో మంజూరు కాబడిన ముషంపల్లి, నర్సింగ్ భట్ల, మాడుగులపల్లి, మామిడాల రోడ్లను ఇప్పటి వరకు ఎందుకు
పూర్తి చేయలేకపోయారు? ప్రజలు, వాహనదారులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికి తీసుకొస్తున్నాను
– పానగల్ ఉదయ సముద్రం, ట్యాంక్ బండ్ గా అభివృద్ధి కోసం, శిల్పారామం, ఛాయా, పచ్చల, వేంకటేశ్వర ఆలయాల అభివృద్ధికి గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నిధులు రూ.119 కోట్లు ఎటుపోయాయి?
– 90 కోట్లతో ప్రతిష్టాత్మంగా నిర్మించిన ఐటీ టవర్ నిరుపయోగంగా ఎందుకు ఉంచారు?
– ఐటీ టవర్ నుండి 30 ఫీట్ల రోడ్డుకు కేటాయించిన నిధులు ఏమయ్యాయి?
– వల్లభరావు చెరువు సుందరరీకరణ కోసం కేటాయించిన రూ.15 కోట్లు ఎందుకు పనులు ప్రారంభించడం లేదు?
– నల్లగొండ నడిబొడ్డు గడియారం సెంటర్లో కేసీఆర్ చే స్థలo ఎంపిక చేయబడి రూ.93 కోట్లతో మంజూరు కాబడిన నల్లగొండ కళాభారతి ఏమైంది?
– కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.36 కోట్ల వ్యయంతో మంజూరు కాబడిన ప్రతిష్టాత్మక నాగార్జున కళాశాల ఇంకా ఎందుకు పూర్తి చేయడం లేదు?
– ఈ రెండున్నర సంవత్సరాలలో నల్లగొండ పట్టణంలో ఎక్కడైనా ఒక్కకొత్త సీసీ రోడ్డు వేయించారా, రోడ్లు వెడల్పు చేశారా? సుందరీకరణ చేశారా?
– నల్లగొండ నగరంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు అక్రమంగా ప్రభుత్వ భూములు, వక్ఫ్ భూములు ఆక్రమించుకుని వెంచర్లు చేయడంపై విచారణ జరిపించాలి
– మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో కాంగ్రెస్ నాయకులు చేసిన వెంచర్లలో అక్రమంగా సిసి రోడ్డు వేయించడంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి
– అవినీతి, అసమర్ధతకు, నిలయమైన నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పై విచారణ జరిపించాలి
– ముఖ్యమంత్రిగా రెండోసారి నల్లగొండకు వస్తున్న మీరు మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని అంశాలను, ముఖ్యంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు బంధు, మహిళలకు రూ.2,500, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తులం బంగారం, వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ వెంటనే ప్రకటించాలి
– ఏఎంఆర్పీ కాల్వల లైనింగ్ పనుల కోసం రూ.1,500 కోట్లు ప్రకటించాలి
– బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ పనుల పూర్తి కోసం మరో రూ.500 కోట్లు కేటాయించాలి
-ప్రభుత్వ ఆస్పత్రి కోసం రూ.500 కోట్లు కేటాంయిచాలి
– మొత్తం నల్లగొండ అభివృద్ధి కోసం రూ.3 వేల కోట్ల నిధులు మంజూరు చేయాలి
పై విషయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన తమ దృష్టికి తీసుకుని వస్తున్నందున నల్లగొండ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిందిగా బహిరంగ లేఖ ద్వారా కోరుతున్నట్లు కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి బహిరంగ లేఖ

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి బహిరంగ లేఖ