యాదగిరిగుట్ట, ఏప్రిల్ 27 : పంచనారసింహుడి క్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు కల్యాణోత్సవ సేవ అత్యంత వైభవంగా జరిగింది. గురువారం ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేసి సేవ చేపట్టారు. కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్ల కల్యాణతంతు నిర్వహించారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణం జరిపించారు. భక్తులు పాల్గొని కల్యాణాన్ని కనులారా వీక్షించి పరవశించిపోయారు. తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టారు.
స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. ప్రధానాలయ ముఖమండపంలో శ్రీవారికి పలు దఫాలుగా సువర్ణ పుష్పార్చనలు జరిపించారు. సాయంత్రం స్వామివారిని గరుఢ వాహనంపై, అమ్మవారిని తిరుచ్చీపై వేంచేపు చేసి తిరుమాఢవీధుల్లో ఊరేగించారు. జోడు సేవలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులకు దర్బార్ సేవ నిర్వహించారు. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు జరిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ.14,67,354 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. స్వామివారి కల్యాణోత్సవంలో దంపతులు పాల్గొన్నారు.