యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 11 : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి నిత్యోత్సవాలను శనివారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వయంభువుడిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామి వారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వెంచేపు కల్యాణోత్సవం జరిపించారు.
సుమారు గంటన్నర పాటు సాగిన కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం, దర్భార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. శనివారం సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో సందడి నెలకొంది. ఆలయ మాఢవీధులు, క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్ ప్రాంతాల్లో భక్తులే దర్శనమిచ్చారు. సుమారు 25వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.29,63,404 ఆదాయం సమకూరిందని ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు
శ్రీవారిని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్‌కుమార్, రాష్ట్ర జైలు విభాగం ఐజీ రాజేశ్ వేర్వేరుగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికి, స్వామివారి వేదాశీర్వచనం చేయగా ఆలయాధికారులు స్వామివారి ప్రసాదం అందించారు.
ఎల్లుండి హుండీ లెక్కింపు
లక్ష్మీనరసింహ స్వామి హుండీలను ఈ నెల 14న లెక్కించనున్నట్లు ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు వెల్లడించారు. కొండకింద సత్యనారాయణ వ్రత మండపంలో ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రారంభిస్తామని తెలిపారు.