కట్టంగూర్, అక్టోబర్ 23 : చిట్యాల పట్టణంలో ఈ నెల 25న నిర్వహించే కల్లుగీత కార్మిక సంఘం 4వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు దందెంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం కట్టంగూర్ లోని అమరవీరుల స్మారక భవనంలో మహాసభల పోస్టర్ ను సంఘం నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర కల్లుగీత కార్పోరేషన్ కు ప్రభుత్వం రూ.5 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించి ప్రతి సొసైటీకి 5 ఎకరాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలను ఏర్పాటు చేసి గౌడ్ యువకులకు ఉపాధి కల్పించాలన్నారు.
అర్హులైన ప్రతి గీత కార్మికుడికి సభ్యత్వంతో పాటు గుర్తింపు కార్డులు కొత్త జిల్లాల పేరుతో ఇవ్వాలని కోరారు. ప్రమాదంలో చనిపోయిన, శాశ్వత వికలాంగులకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా అందించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, పిల్లలకు ఉచిత విద్యనందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం మండలాధ్యక్షుడు మాద శ్రీను, గౌరవ అధ్యక్షుడు చౌగోని లింగయ్య, ఉపాధ్యక్షులు పనస యాదయ్య, ఆకుల శంకరయ్య, సురిగి సత్తయ్య, సహాయ కార్యదర్శి వేముల సైదులు, కోశాధికారి నీలం అంజయ్య, నర్సింహ్మ, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.